మణికొండ ఫిబ్రవరి 3( నమస్తే తెలంగాణ): నగరంలో గంజాయి సరఫరా ముఠా(Marijuana gang) మళ్లీ హల్ చల్ చేస్తున్నది. మణికొండ(Manikonda) మున్సిపాలిటీ పరిధిలోని పోచమ్మ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు యువకులకు గంజాయిని విక్రయించి వారిని మత్తులో దింపిన ఘటన సోమవారం తెల్లవారుజామున స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. కొంతమంది యువకులు అర్ధరాత్రి పోచమ్మ కాలనీలో గంజాయి తోపాటు మద్యం సేవిస్తూ స్థానికలను తీవ్ర భయాందోళన గురి చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు. వారు సకాలంలో స్పందించకపోవడంతో గంజాయి మత్తులో ఉన్న యువకులు మధ్యలో చెలరేగిన గొడవతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు.
అనంతరం కొంతమంది చుట్టుపక్కల ఇళ్లల్లోకి చొరబడి బెదిరింపులకు పాల్పడుతుండంతో స్థానికులు మరోసారి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రాకపోవడంతో స్థానికంగా ఉన్న కొంతమంది వ్యక్తులు గంజాయి ముఠాను బెదిరించేందుకు ప్రయత్నించారు. అయితే మత్తులో ఉన్న యువత వారిని చితకబాది అక్కడి నుంచి పారిపోయాయరని స్థానికులు తెలిపారు. ఈ దాడిలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
గతంలో జరిగిన ఘటనలు..
కాగా, మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో గంజాయి ముఠా ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడిందని స్థానికులు తెలిపారు. ఇదే విషయమై రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించినా పెట్రోలింగ్ సక్రమంగా నిర్వహించకపోవడంతో గంజాయి ముఠా విచ్చలవిడిగా కాలనీలలో తిరుగుతూ భయాందోళన గురిచేస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు సకాలంలో స్పందించి చర్యలు తీసుకోవాలని పోచమ్మ కాలనీవాసులు కోరుతున్నారు.