Hyderabad | ఖైరతాబాద్, ఏప్రిల్ 4 : సమయానికి కల్లు దొరకలేదని ఓ వ్యక్తి ప్రాణం తీసుకున్నాడు. కొంతకాలంగా కల్లుకు బానిసైన అతను.. రెండు రోజులుగా తాగకపోవడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురై.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో శుక్రవారం నాడు ఈ సంఘటన చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన హనుమాండ్ల పోశం (80) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కాలేయానికి సంబంధించిన చొలంగైటీస్తో పాటు సెప్సిస్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో అతన్ని ఈ నెల 1వ తేదీన కుమారులు నారాయణ (55), మధుకర్‌లు హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేర్పించారు. ప్రస్తుతం పోశంకు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో చికిత్స అందిస్తున్నారు. కాగా, నారాయణ కొంతకాలంగా కల్లుకు బానిసయ్యాడు. రోజూ కల్లు తాగకపోతే నారాయణకు ఏదీ తోచదు. అయితే, తండ్రిని నిమ్స్‌కు తీసుకురావడంతో రెండు రోజులుగా కల్లు తాగడం కుదర్లేదు. దీంతో శుక్రవారం నాడు కల్లు కోసం ప్రయత్నించాడు. కానీ ఎక్కడా దొరకలేదు. దీంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన నారాయణ.. ఆస్పత్రి భవనంలోని రెండో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు యత్నించాడు. రెండో అంతస్తు నుంచి దూకడంతో నారాయణ తలకు తీవ్ర గాయమైంది. దీంతో అతన్ని ఎమర్జెన్సీ వార్డుకు తరలించి, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. కానీ పరిస్థితి విషమించడంతో మరణించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.