Double Bedroom | బంజారాహిల్స్, ఏప్రిల్ 15: జీహెచ్ఎంసీ పరిధిలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లు కొన్ని ఖాళీగా ఉన్నాయని.. వాటిని ఇప్పిస్తానని నమ్మించి పలువురి నుంచి ఓ వ్యక్తి లక్షలు వసూలు చేశాడు. బాధితులకు అనుమానం రాకుండా ఆర్డీవోల సంతకాలు ఫోర్జరీ చేసి బోగస్ పట్టాలను కూడా అందజేశాడు. అయితే ఇండ్లు వచ్చాయనే ఆనందంతో అక్కడికి వెళ్లిన తర్వాత అసలు విషయం బయటపడటంతో బాధితులు లబోదిబోమన్నారు. చివరకు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.
వివరాల్లోకి వెళ్తే.. సంకర్షన్ దాస్ అనే వ్యక్తి 20 ఏండ్ల క్రితం బతుకుదెరువు కోసం కుటుంబంతో సహా ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలోని వెంకటగిరిలో నివాసం ఉంటూ ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో పనిచేస్తున్న సమయంలో అక్కడ ఆఫీస్ బాయ్‌గా పనిచేసిన నాగరాజు రెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇటీవల సంకర్షన్ దాస్‌ను కలిసి నాగరాజు.. గత ప్రభుత్వ హయాంలో కట్టిన కొన్ని డబుల్ బెడ్రూం ఇండ్లు ఖాళీగా ఉన్నాయని , వాటిని ఇప్పిస్తానని నమ్మబలికాడు. తనకు జీహెచ్ఎంసీ హెడాఫీస్లో పనిచేస్తున్న ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి తెలుసని, అతనికి ఉన్న పరిచయాలతో రాజేంద్రనగర్, మల్కాజ్గిరి తదితర ప్రాంతాల్లో గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూంల్లో ఖాళీగా ఉన్న వాటిని అలాట్ చేయిస్తానని చెప్పాడు. ఇందుకోసం ఒక్కో ఇంటికి రూ.4 లక్షల దాకా ఖర్చవుతుందని తెలిపారు. అడ్వాన్స్‌గా రూ.2లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. అతని మాట నమ్మిన సంకర్షన్ దాస్ గత ఏడాది ఏప్రిల్‌లో రూ.1.5లక్షలు చెల్లించాడు.
అనంతరం తనతో పాటు మరో 10 మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పించాలని నాగరాజును సంకర్షన్ దాస్ కోరాడు. వారందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తానని నాగరాజు హామీ ఇచ్చాడు. గత ఏడాది సెప్టెంబర్‌లో వారికి ప్రదీప్ రెడ్డిని పరిచయం చేయడంతో పాటు.. ఒక్కొక్కరి నుంచి రూ.2లక్షల చొప్పున 20 లక్షల దాకా వసూలు చేశాడు. ఆ తర్వాత వారికి రాజేంద్రనగర్, మల్కాజ్గిరి మండలాల పరిధిలో ఇండ్లు వచ్చాయని నాగరాజు చెప్పాడు. అంతేకాకుండా డబుల్ బెడ్రూం కేటాయించినట్లుగా ఆర్డీవో సంతకాలు ఫోర్జరీ చేసి ఇళ్ల పట్టాలు కూడా అందజేశాడు. ఆ పత్రాలు చూసి తమకు డబుల్ బెడ్రూం ఇండ్లు వచ్చాయని ఎంతో సంతోషించారు. వెంటనే తమకు కేటాయించిన ఇండ్లను చూసేందుకు వెళ్లారు. ఇటీవల ఆయా ప్రాంతాలకు వెళ్లి చూడగా.. అదంతా బోగస్ అని తేలింది. దీనిపై రాజేంద్రనగర్, మల్కాజ్గిరి ఆర్డీవోలను కలవగా తాము ఎలాంటి పట్టాలు జారీ చేయలేదని స్పష్టం చేశారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సీపీఎం జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యదర్శి సాయి శేషగిరిరావుతో కలిసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.