సిటీబ్యూరో: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. హైదరాబాద్ నగర రియాల్టీకి కీలకమైన శివారు ప్రాంతాల అభివృద్ధిని మరిచింది. కనీసం ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులను కూడా పట్టాలెక్కించలేకపోయింది. బీఆర్ఎస్ హయాంలో నగరాభివృద్ధిని శివారు ప్రాంతాలకు విస్తరించేలా ప్రణాళికలను అమలు చేయగా, అందుకు భిన్నంగా ప్రస్తుత పాలన విధానాలు ఉండటంతో… మెరుగైన సదుపాయాలు ప్రజలకు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు.
కుంటుపడిన అభివృద్ధి
గడిచిన ఏడాది కాలంగా ఓఆర్ఆర్ వెంబడి అభివృద్ధి కుంటుపడింది. ప్రతిపాదనల్లో ఉన్న రేడియల్, లింకు, అంతర్గత రోడ్ల నిర్మాణ పనులను చేపట్టలేదు. ఇక శివారు ప్రాంతాలకు మెరుగైన రవాణా వసతులు కల్పించేలా రూపొందించిన ప్రతిపాదనలను కూడా కార్యరూపంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురాలేదు. ఏడాది కిందట రెండు ఎలివేటెడ్ కారిడార్లకు శంకుస్థాపన చేసినా… ఇప్పటికీ ఆ ప్రాజెక్టు అవసరమైన భూముల సమీకరణ పూర్తి చేయలేదు. ఇక హెచ్ఎండీఏ పరిధిలో నిర్మించే లింకు రోడ్ల నిర్మాణ పనులన్నీ పెండింగ్లోనే పడగా… శివారు ప్రాంతాల్లో అభివృద్ధికి ఆటంకం ఏర్పడింది.
ఎన్నో రోడ్లు నిర్మాణ దశలోనే..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే హైదరాబాద్ నగరానికి గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులకు గతేడాది శంకుస్థాపన చేసింది. దీనికి అవసరమైన భూములను సేకరించేందుకు రక్షణ శాఖ అంగీకరించినా… ఇప్పటి వరకు ఆ భూములకు పరిహారం ఇచ్చేందుకు అనువైన భూములను సేకరించలేకపోయింది. దీంతో ఎలివేటెడ్ ప్రాజెక్టుల భూసేకరణ, పరిహారం ఇప్పుడు సందిగ్ధంలో పడిన నేపథ్యంలో… రక్షణ శాఖకు ఇవ్వాల్సిన దాదాపు 800 ఎకరాల పరిహారం ఇప్పుడు హెచ్ఎండీఏకు తలనొప్పిగా మారింది. అదేవిధంగా అవుటర్ రింగు రోడ్డు లోపల ఉన్న ఎన్నో కాలనీలకు ఇప్పటికీ మెరుగైన రవాణా సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రారంభించిన ఎన్నో రోడ్లు నిర్మాణ దశలోనే ఉన్నాయి. ముఖ్యంగా బాచుపల్లి నుంచి మియాపూర్ వచ్చే మార్గంలో ఇంకా రోడ్డు నిర్మాణంలో ఉంది.
మెరుగైన రవాణా ఇంకెప్పుడూ?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు మార్గాన్ని రద్దు చేయడంతో.. ఎప్పుడో పట్టాలెక్కాల్సిన ఈ ప్రాజెక్టు కూడా నిలిచిపోయింది. ఇక అలైన్ మెంట్ మార్పుతో కోర్ సిటీ నుంచి ఎయిర్పోర్టు వరకు మెట్రో నిర్మాణం మరింత జాప్యం కానున్నది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ఇంకా డీపీఆర్ దశలోనే ఉండగా… కేంద్రం అనుమతులిచ్చినా… పనులు పూర్తి కావడానికి కనీసం ఎనిమిదేండ్లు పట్టనున్నది. అప్పటివరకు శంషాబాద్ లాంటి కీలకమైన ప్రాంతాలకు ఆర్టీసీ, ఇతర ప్రైవేటు రవాణా సౌకర్యాలను వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంది.