Hyderabad | బంజారాహిల్స్, ఏప్రిల్ 18 : ఎప్పుడు చూసినా సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నావని తల్లిదండ్రులు మందలించడంతో ఓ బాలిక ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని సయ్యద్నగర్లో నివాసం ఉంటున్న బాలిక(16) ఏడోతరగతిలో చదువు ఆపేసి ఇంట్లోనే ఉంటోంది. గత కొన్నేండ్లుగా ఇన్స్టాగ్రామ్, స్నాప్ చాట్, వాట్సాప్ తదితర సోషల్ మీడియాలో అకౌంట్స్ పెట్టుకున్న బాలిక ఎప్పుడు చూసినా చాటింగ్ చేస్తుండడంతో పాటు వీడియోలు చూస్తోంది.
ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు పలుమార్లు నిలదీసినా అలవాటు మానుకోలేదు. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం మరోసారి కుటుంబసభ్యులు సోషల్ మీడియాకు బానిస కావొద్దని సూచించారు. దీంతో మనస్థాపానికి గురైన బాలిక ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఈ మేరకు బాలిక కుటుంబసభ్యులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.