Hyderabad | హైదరాబాద్ : మద్యం మత్తులో ఇద్దరు అన్నదమ్ముళ్ల మధ్య జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. ఈ ఘటన బోరబండ పరిధిలోని ఇంద్రానగర్‌లో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఇంద్రానగర్‌కు చెందిన కజిన్ బ్రదర్స్ బసవరాజ్(30), ప్రేమ్ రాజ్ ఇద్దరూ కలిసి సోమవారం పార్వతీ నగర్లో మద్యం సేవించారు. ఈ సమయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం ఇద్దరూ ఇంటికి చేరుకుని నిద్ర పోయారు. అయితే మంగళవారం తెల్లవారుజామున ప్రేమ్‌రాజ్ నిద్రలో నుంచి మేల్కొన్నాడు. తనతో గొడవపడ్డ బసవరాజ్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ముందుగానే తెచ్చిపెట్టుకున్న బండ రాయితో బసవరాజ్ తలపై బలంగా మోదాడు. దీంతో తీవ్ర గాయాలతో బసవరాజ్ అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బసవరాజ్‌ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై బోరబండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.