Hyderabad | సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒకలెక్క.. గా రాష్ట్రంలో పాలన సాగనున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చింది. అయితే, అధికారంలోకి రాగానే ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో భారీగా మార్పులు చేశారు. ట్రై పోలీస్ కమిషనర్లతో పాటు అదనపు సీపీలు, జాయింట్ సీపీలు, డీసీపీలు, ఏసీపీల, ఇన్స్పెక్టర్లను బదిలీ చేసి, మార్చేశారు. కాగా, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయనే ముందుచూపు లేకుండానే ఈ బదిలీలు చేపట్టారు. అయితే, ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొందరు అధికారులకు సాంకేతిక కారణాలు అడ్డొచ్చాయి. తిరిగి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగియనుండటంతో అప్పట్లో కోడ్ కారణంగా బదిలీ అయిన వారు తిరిగి ఆ స్థానాల్లోకి వచ్చే అవకాశాలున్నాయి.
ఈ నేపథ్యంలోనే ట్రై పోలీస్ కమిషనరేట్లలోని ఉన్నతాధికారుల్లో కొందరు బదిలీ కావచ్చనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ట్రై పోలీస్ కమిషనరేట్లలో కొంత మంది నిజాయితీ, ముక్కుసూటీగా ఉండే ఉన్నతాధికారులను నియమించింది. ఈ అధికారులు అందరిని ఒకేలా చూడటం, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా కిందిస్థాయిలో బదిలీలు, కేసుల దర్యాప్తులు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు కూడా పూర్తవ్వడంతో అలాంటి ముక్కుసూటీ, నిజాయితీ పరులైన అధికారులను అక్కడే కొనసాగిస్తారా..? తాము చెబితే వినే అధికారులు ఉండాలని బావిస్తూ బదిలీలు చేస్తారా..? అనే విషయాలు ఇప్పుడు పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారాయి.