మేడ్చల్/ రంగారెడ్డి / హైదరాబాద్, మే 10(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పదోతరగతి పరీక్షా ఫలితాల్లో 90.72 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ సారి కూడా బాలికలదే హవా కొనసాగింది. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 43,319 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. వారిలో 39, 299 ఉత్తీర్ణులయ్యారు. ఇది 90.72 శాతంగా నమోదైంది. బాలికలు 92.42 శాతం ఉత్తీర్ణతతో బాలురు కంటే ముందంజలో నిలిచారు. బాలురు 89.10 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. కాగా ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో 1099 మంది పది జీపీఏ మార్కులు సాధించారు. ఇందులో బాలురు 22,224 మంది పరీక్షలు రాయగా… 19,802 మంది ఉత్తీర్ణత సాధించారు. 21,095 మంది బాలికలు పరీక్షలు రాయగా..19,497 ఉత్తీర్ణులయ్యారు.
‘పది’లో రంగారెడ్డి 87.25 శాతం..
పదో తరగతి పరీక్షలు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 47,551 మంది రాయగా.. 42,488 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 24,444 మంది బాలురు పరీక్షలు రాయగా.. 20,825 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 85.19 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే బాలికలు 23,107 మంది పరీక్షలకు హాజరవగా.. 20,663 మంది ఉత్తీర్ణులై 89.42 శాతంతో ముందంజలో నిలిచారు. జిల్లాలో పదో తరగతి ఫలితాల్లోనూ బాలికలు తమ సత్తా చూపి బాలుర కంటే అత్యధిక ఉత్తీర్ణతా శాతం సాధించారు. జిల్లాలో 15 సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు ఉండగా, వాటిలో 22 మంది విద్యార్థులు 10/10, బీసీ వెల్ఫేర్కు సంబంధించి 16 పాఠశాలలు ఉండగా… వీటిలో 14 మంది విద్యార్థులు 10/10 మార్కులు సాధించారు. ఆశ్రమ పాఠశాల ఒక్కటి మాత్రమే ఉండగా, 97.73 శాతం ఫలితాలు వచ్చాయి.
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు 15 ఉండగా 96.06 శాతం, మైనార్టీస్ రెడిసిడెన్షియల్ 9 పాఠశాలల్లో 94.71 శాతం, బీసీ వెల్ఫేర్కు 16 పాఠశాలలు ఉండగా 94.57 శాతం, ట్రైబల్ వెల్ఫేర్కు 3 పాఠశాలలు ఉండగా, 91.63 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మోడల్ స్కూల్స్ 9 ఉండగా…90.17 శాతం, ఎయిడెడ్ పాఠశాలల్లో 85.33 శాతం, కేజీబీవీ పాఠశాలలు 20 ఉండగా 79.02 శాతం, జిల్లా పరిషత్ పాఠశాలలు 238 ఉండగా.. 70.94శాతం, ప్రభుత్వ పాఠశాలలు నాలుగు ఉండగా 63.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
హైదరాబాద్లో 80.29 శాతం ఉత్తీర్ణత..
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 80.02 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు జిల్లా విద్యాధికారి ఆర్.రోహిణి బుధవారం తెలిపారు. ఇందులో బాలురు కంటే బాలికలు అధిక ఉత్తీర్ణత సాధించారు. బాలురు 76.55 శాతంతో ఉత్తీర్ణత సాధించగా.. 83.89 శాతం మార్కులతో బాలికలు అత్యధికంగా ఉత్తీర్ణులయ్యారు. జిల్లా నుంచి మొత్తం 68,468 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వారిలో బాలురు 33,092, బాలికలు 35,376 మంది ఉన్నారు. బాలురు, బాలికలు కలిపి మొత్తం 54,971 మంది ఉత్తీర్ణులయ్యారు.
ప్రభుత్వ పాఠశాలల్లో 72.77 శాతం..
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న జిల్లా విద్యార్థులు మొత్తం 72.77 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలోని మొత్తం 12 మండలాల్లో నమోదైన వివరాలను డీఈవో ప్రకటించారు. 12 మండలాల నుంచి మొత్తం 7,244 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. వారిలో 5,235 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వారిలో 2009 మంది ఫెయిలయ్యారు. అయితే జిల్లాలోని అమీర్పేట్ మండలంలో 88.95 శాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో నిలువగా.. 62.13 శాతం ఉత్తీర్ణతతో సికింద్రాబాద్ మండలం చివరి స్థానంలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.
బీసీ హాస్టల్లో 47 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు
సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్న 15 హాస్టళ్లకు చెందిన 51 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. కాగా వారిలో 42 మంది ఉత్తీర్ణత సాధించినట్లు బీసీ సంక్షేమ శాఖ అధికారి బీ.ఆశన్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.