మెహిదీపట్నం, నవంబర్ 13 : నకిలీ కరెన్సీ కేసుల్లో జైలుకు వెళ్లివచ్చినా బుద్ధి మారని ఓ దొంగ తన పాత పంథాను కొనసాగిస్తూ నకిలీ నోట్లు చలామణి చేస్తూ పట్టుబడ్డాడు. ఇతడితో పాటు మరో ఏడుమందిని మెహిదీపట్నం పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుంచి 4 లక్షల 75వేల రూపాయల దొంగనోట్లను, ఓ కారును, మూడు ద్విచక్రవాహనాలను, 9సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు గురువారం మెహిదీపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దక్షిణ, పశ్చిమ మండలం అదనపు డీసీపీ కృష్ణాగౌడ్, ఆసిఫ్‌నగర్ ఏసీపీ కిషన్‌కుమార్, మెహిదీపట్నం ఇన్స్పెక్టర్ మల్లేశ్‌తో కలిసి వివరాలను వెల్లడించారు.
కోస్గి మండలం, గుండిమల్ గ్రామానికి చెందిన కస్తూరి రమేశ్ బాబు(35) తాండూరు ఎంఎస్ ఫంక్షన్‌హాల్ సమీపంలో కారు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఇతను దొంగనోట్లు చలామణి చేస్తూ గుజరాత్ రాజ్‌కోట్, నగరంలోని చాంద్రాయణ గుట్ట, గోపాలపురం పోలీస్ స్టేషన్ల నుంచి అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లాడు. ఇతడి చెల్లెలు రామేశ్వరి కూడా తన అన్నకు సహకరిస్తూ గుజరాత్ పోలీసులకు పట్టుబడింది. ఇదిలా ఉండగా బుధవారం రాత్రి మెహిదీపట్నం ఫస్ట్‌లాన్సర్ ఈద్గా మైదానం సమీపంలో ఇతడు నోట్లు మార్చుతుండగా దక్షిణ, పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి మెహిదీపట్నం పోలీసులు పట్టుకున్నారు.
ఇతడితో పాటు మొత్తం 8 మందిని పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పాతబస్తీ సులేమాన్ నగర్‌కు చెందిన అబ్దుల్ వహీద్(21), మహ్మద్ అబ్దుల్ ఖాదర్ అలియాస్ తాహ(21), మహ్మద్ సోహైల్ , బహదూర్‌పురాకు చెందిన మహ్మద్ ఫహాద్(23), కిషన్‌బాగ్‌కు చెందిన షేక్‌ఇమ్రాన్(23), ఉప్పుగూడకుచెందిన ఉమర్ ఖాన్(23), సయ్యద్ అల్తామష్(21)లు పట్టుబడిన వారిలో ఉన్నారు. వీరందరికి రమేశ్‌బాబు నకిలీ కరెన్సీ 500 రూపాయల నోట్లను సరఫరా చేస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. రమేశ్‌బాబు సోదరి రామేశ్వరి పరారీలో ఉంది. కేసును దక్షిణ,పశ్చిమ మండలం డీసీపీ చంద్రమోహన్ ఆదేశాలతో మెహిదీపట్నం పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ మల్లేశ్ దర్యాప్తు చేస్తున్నారు.