మేడ్చల్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా జనవరి 18న ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమానికి 75 బృందాలను నియమించారు. జిల్లాలోని మేడ్చల్ , మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోని జీహెచ్ఎంసీ పరిధితో పాటు రూరల్ ప్రాంతాలకు చెందిన 27,75,067 మందికి పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
జీహెచ్ఎంసీలోని 40 వార్డులకు 43 బృందాలు, అర్బన్‌లో 13 బృందాలు, 61 గ్రామ పంచాయతీలకు 10 బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. 75 బృందాలతో పాటు అదనంగా మరో 4 బృందాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నారు. కంటి వెలుగు శిబిరాలు నిర్వహించేందుకు అనువైన ప్రభుత్వ స్థలాలు, కమ్యూనిటీ భవనాలను గుర్తించి అవసరమైన సదుపాయాలను త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. దీనిపై విస్తృత ప్రచారం నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అవసరమైన సామాగ్రిని త్వరలోనే ప్రభుత్వం పంపించనున్నదని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్ తెలిపారు. కంటి వెలుగు శిబిరాలలో పరీక్షలకు అవసరమయ్యే సిబ్బందిని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
జిల్లా వ్యాక్సిన్, సెంట్రల్ స్టోర్స్‌ను సందర్శించిన వైద్యాధికారి
శామీర్‌పేట్‌లోని వ్యాక్సిన్, సెంట్రల్ స్టోర్స్‌ను గురువారం జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్ సందర్శించారు. 2018లో నిర్వహించిన కంటి వెలుగు మిగులు అద్దాలను పరిశీలించారు. త్వరలోనే రానున్న కంటి అద్దాలు, మందులను సెంటర్ స్టోర్స్‌లో ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలని అధికారులకు సూచించారు.ందులు, అద్దాల పంపిణీలో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కంటివెలుగు బృందాలు
ఒక డాక్టర్, ఆప్‌తో మెట్రిస్ట్, ఇద్దరు ఏఎన్ఎంలు, ముగ్గురు ఆశావర్కర్లు, ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు సీహెచ్‌ఓలు.