Jubleehills by Poll | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయిరాం అధికారికంగా ప్రకటించారు. మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, 81 మంది అభ్యర్థులు అర్హత పొందినట్లు పేర్కొన్నారు. వీరిలో ఇవాళ వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, పలువురు స్వతంత్రులు మొత్తం 23 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో పోటీలో 58 మంది మాత్రమే ఉన్నట్లు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ వెల్లడించారు.
ఇక ఇంత మంది పోటీ చేయడం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇదే తొలిసారి. 2009 ఎన్నికల్లో 13 మంది, 2014లో 21 మంది, 2018లో 18 మంది పోటీ పడ్డారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 19 మంది పోటీ పడ్డారు. ఈ 19 మందిలో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ గెలుపొంది వరుసగా రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
అధికార కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా ఫార్మాసిటీ, ట్రిపుల్ఆర్ బాధితులు, నిరుద్యోగులతోపాటు వివిధ వర్గాలకు చెందిన కాంగ్రెస్ బాధితులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, అందులో సగానికిపైగా నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో వారంతా ఆందోళనకు దిగారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి చెందిన అభ్యర్థులతోపాటు వివిధ వర్గాలకు చెందిన 211 మంది అభ్యర్థులు మొత్తంగా 321 నామినేషన్లను దాఖలు చేశారు. బుధవారం ఉదయం ప్రారంభమైన నామినేషన్ల పరిశీలన గురువారం తెల్లవారుజామున 3 గంటల దాకా కొనసాగింది. మొత్తం 321 నామినేషన్లను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి.. 186 నామినేషన్లను తిరస్కరించారు. మిగిలిన 135 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు తేల్చారు. నామినేషన్ల పరిశీలన అనంతరం 130 మందికి చెందిన నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించగా, 81 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం తెలిపారు.