రవీంద్రభారతి, జూలై 13: పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీల అభివృద్ధికై కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించాలని ఆగస్టు 6న చలో పార్లమెంట్ ఉద్యమ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య తెలిపారు. బీసీ సంఘాల కోర్ కమిటీ నాయకుల సమావేశం జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గవ్వల భరత్ అధ్యక్షతన శనివారం సమావేశాన్ని నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. ఈ నెల 22వ తేదీ నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాలలోనే బీసీ బిల్లును ప్రవేశ పెట్టి బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాలలో జనాభా ప్రకారం, వాటా ఇచ్చే విధంగా బీసీల బిల్లు ప్రవేశ పెట్టాలని కోరారు. రాజ్యాంగంలో పేర్కొన్న సమానత్వం, సామాజిక న్యాయం 76 ఏండ్ల తరువాత కూడా అమలు కావడం లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల సేకరించిన గణాంకాల ద్వారా రాజకీయ రంగంలో బీసీల ప్రాతినిధ్యం 14 శాతం దాటలేదని, దీంతో బీసీలకు ఎంత అన్యాయం జరిగిందో తెలుస్తుందన్నారు. బీసీలకు కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బీసీల జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతానికి పెంచాలని కోరారు. ప్రతి సంవత్సరం ప్రవేశ పెట్టే బడ్జెట్లో బీసీలకు రెండు లక్షల కోట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్ట్‌ని తీసుకురావాలని కోరారు. ఆందోళన కార్యక్రమానికి కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, డీఎంకే, అన్నా డీఎంకే, జనతాదళ్ తదితర పార్టీలను ఆహ్వానిస్తున్నామన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టి పార్లమెంట్ ముట్టడించడానికి కూడా వెనకాడమని హెచ్చరించారు.