మలక్పేట : దివ్యాంగులకు విద్యాసంస్థల్లో 5 శాతం రిజర్వేషన్లు (Reservations) కల్పిస్తూ జీవో జారీచేశామని, సంక్షేమ పథకాల్లో కూడా 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, మహిళా, శిశు సంక్షేమ శాఖమంత్రి సీతక్క (Minister Sitakka) అన్నారు. దివ్యాంగుల ఉద్యమనేత హెలెన్ కెలర్ (Helen Keller) జయంతి సందర్భంగా గురువారం మలక్పేట నల్గొండ చౌరస్తాలోని దివ్యాంగుల జాతీయ ఉద్యానవనంలో కెలర్ విగ్రహాన్ని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్యతో కలిసి ఆమె ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న కృత నిశ్చయంతో ఉన్నామని పేర్కొన్నారు. జల్(Jal), జీవన్ మిషన్ (Jeevan Mission) కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పరుస్తామని అన్నారు.
అనేక గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు సరిగ్గా లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, 1, 270 రోడ్ల కనెక్టివిటీ కోసం నిధులు కావాలని కేంద్రాన్ని కోరామని వెల్లడించారు. అందుకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులశాఖ ప్రిన్సిపల్ సేక్రేటరీ వాకాటి అరుణ, ఎండి బి.శైలజ, జీఎం ప్రభంజన్రావు, వికలాంగుల సంఘాల నాయకులు ఫెడ్ ప్రధాన కార్యదర్శి చెరుకు నాగభూషణం, గంగారాం, నారా నాగేశ్వర్రావు, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.