వంద శాతం పక్కాగా..
పాస్ యంత్రాలకు, వెయింగ్ మిషన్లకు బ్లూటూత్‌తో లింక్
మే 1 నుంచి అందుబాటులోకి n నగరంలోని 668 రేషన్ దుకాణాల్లో అమలు
సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాల్లో 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు ఉపయోగిస్తున్న 2జీ టెక్నాలజీ సేవలతో పలు ఇబ్బందులు తలెత్తుతున్నందున 4జీని ఉపయోగిస్తూ రేషన్ దుకాణాలను డిజిటలీకరణ చేయనున్నారు. బ్లూ టూత్ సాయంతో ఈ పాస్ యంత్రాలు (బయో మెట్రిక్), తూకం వేసే యంత్రాన్ని అనుసంధానం చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులకు వంద శాతం పక్కాగా ప్రభుత్వం అందించే రేషన్ అందనున్నది. హైదరాబాద్‌లో 668 రేషన్ దుకాణాలు ఉండగా, దాదాపు అన్ని దుకాణాలకు జిల్లా పౌరసరఫరాల అధికారులు కొత్త యంత్రాలను పంపిణీ చేశారు.
హెచ్చు తగ్గులు ఉండవిక
రేషన్ పంపిణీలో పలు సమస్యలు తలెత్తుతున్నందున ప్రభుత్వం 4జీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఇప్పటివరకు తూనికల్లో హెచ్చు, తగ్గులు ఉన్నాయనే ఆరోపణలు రావడం, బయోమెట్రిక్ నిదానంగా పనిచేయడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు పెరిగిపోవడంతో ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా 4జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
బ్లూటూత్‌తో అనుసంధానం
ఇప్పటి వరకు ఈపాస్ యంత్రం, తూనికల యంత్రం వేరు వేరుగా ఉండేది. లబ్ధిదారుల నిర్ధారణ పూర్తయిన తరువాత వారికి రేషన్ అందించేవారు. కొత్త టెక్నాలజీలో ఈపాస్ యంత్రానికి, తూనికల యంత్రం అనుసంధానమై ఉంటుంది. లబ్ధిదారుడు వేలి ముద్ర ద్వారా నిర్ధారణ అయిన వెంటనే బ్లూటూత్‌తో తూనికల యంత్రానికి సిగ్నల్స్ వెళ్తాయి. లబ్ధిదారుడి కుటుంబంలో ఎంత మంది ఉన్నారు, ఎంత మేర రేషన్ అందించాలి అనే సమాచారం వెళ్తుంది. దీని ఆధారంగా రేషన్ అందజేయనున్నారు. ఇదంతా ఆటోమెటిక్‌గా రికార్డు అవుతుంది. సేవలు వేగంగా అందడంతో పాటు లబ్ధిదారుడికి హెచ్చు తగ్గులు లేకుండా రేషన్ సరఫరా జరుగుతుంది. ఫలితంగా దుకాణందారులపై కూడా ఎలాంటి ఆరోపణలు ఉండకుండా అంతా పారదర్శకంగా సాగుతుంది.
మే 1నుంచి అమలు చేస్తాం
ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్‌దుకాణాల డిజిటలీకరణ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నగరంలో ఉన్న అన్ని దుకాణాలకు ఆధునిక యంత్రాలు అందజేశాం. ఈపాస్ యంత్రాలకు, వెయింగ్ యంత్రాలకు బ్లూటూత్‌తో అనుసంధానం చేసే ప్రక్రియను ఈ వారంలో పూర్తి చేసి దుకాణ దారులకు అవగాహన కల్పిస్తాం. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అన్ని దుకాణాల్లో 4జీ సేవలను అందుబాటులోకి తెస్తాం. – రమేశ్, జిల్లా పౌరసరఫరాల అధికారి.