సిటీబ్యూరో, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఎన్నిక ఏదైనా మా వైఖరిలో తేడా ఏమీ ఉండదని జూబ్లీహిల్స్ ఓటర్ మరోసారి నిరూపించారు. ప్రతిసారీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ 50 శాతానికి మించడం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 47.49 శాతం పోలింగ్ నమోదు కాగా.. తాజాగా ఉప ఎన్నికలో 48.49 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఇక్కడ కేవలం ఒక్కశాతం మాత్రమే పోలింగ్ శాతం పెరగడం గమనార్హం. ఉప ఎన్నిక సమయానికి నియోజకవర్గంలో మొత్తం 4.01 లక్షల ఓటర్లు ఉండగా …లక్షా 94వేల 631 మంది మాత్రమే ఓటుహక్కును వినియోగించుకున్నారు. కేవలం 48.49 శాతం పోలింగ్ మాత్రమే నమోదు అయినట్లు జిల్లా ఎన్నికల అధికారులు బుధవారం అధికారికంగా ప్రకటించారు. 99,771 మంది పురుషులు (అత్యధికం) ఓటు వేశారు.
బస్తీల్లో ఉండే ఓటర్లు ఓటేసేందుకు ఆసక్తి చూపగా, అపార్ట్మెంట్లలో ఉన్న ఓటర్లు చాలావరకు ఓట్లు వేయనట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్తగా ఓటుహక్కు వచ్చిన యువత ఓటు వేసేందుకు ఉత్సాహం కనబర్చారు. అయితే పోలింగ్ శాతం తగ్గడానికి కారణాలు లేకపోలేదని విశ్లేషకుల అంచనా.. ప్రైవేట్ ఉద్యోగులకు సెలవులు లేకపోవడం, ఓటింగ్ శాతం పెంచడంలో అధికారుల ప్రచార లోపం, పోలింగ్ బూత్ల వరకు ఓటర్లను రప్పించడంలో రాజకీయ పార్టీలు విఫలం అయ్యాయనే ఆరోపణలున్నాయి.
సాధారణంగా ఎక్కడైనా ఉప ఎన్నికలో భారీగా పోలింగ్ శాతం నమోదు అవుతుంటుంది. కానీ జూబ్లీహిల్స్లో మాత్రం ఒక్క శాతమే ఓటింగ్ పెరగడంతో.. గెలుపు ఎవరిని వరిస్తుందా అనేది తెలియని పరిస్థితి. తామే గెలుస్తామంటూ కాంగ్రెస్ పార్టీ, కాదు కాదు తామే గెలుస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సర్వేలు అన్నీ తమ వైపే ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతుండగా… సైలెంట్ ఓటింగ్ జరిగిందని.. తద్వారా తమ విజయం ఖాయమని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మొత్తంగా శుక్రవారం మధ్యాహ్నం తుది ఫలితం వెల్లడయ్యే వరకు ఉత్కంఠ తప్పని పరిస్థితి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం
మొత్తం ఓటర్లు : 4,01,365
పురుషులు : 2,08,561
మహిళలు : 1,92,779
ఇతరులు : 25
పోలింగ్ శాతం : 48.49
ఓటుహక్కును సద్వినియోగం చేసుకున్నవారు : 1,94,631
పురుషులు : 99,771
మహిళలు : 94,855
ఇతరులు : 5