Ganja | హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి భారీ స్థాయిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మహిళా బ్యాంకాక్ నుంచి వయా దుబాయి మీదుగా హైదరాబాద్ నగరానికి గంజాయిని తీసుకొచ్చినట్లు అధికారులు నిర్ధారించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళా ప్రయాణికురాలు బ్యాంకాక్ నుంచి దుబాయి మీదుగా హైదరాబాద్ నగరానికి భారీగా గంజాయి తీసుకువస్తున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో బుధవారం రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అధికారులు నిఘా పెంచారు. దుబాయి నుంచి మహిళా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వగానే ఆమెను అదుపులోకి తీసుకుని, లగేజీని తనిఖీ చేశారు.
ఆమె వద్ద 40 కిలోల గంజాయిని గుర్తించారు. ఇది నిషేధిత హైడ్రోపోనిక్ గంజాయి అని అధికారులు నిర్ధారించారు. ఈ గంజాయి విలువ రూ. 40 కోట్ల విలువ చేస్తుందని తెలిపారు. అయితే ఈ మహిళ గత కొంతకాలం నుంచి గంజాయి దందా కొనసాగిస్తున్నట్లు విచారణలో తేలింది. బ్యాంకాక్ నుంచి నేరుగా శంషాబాద్‌కు వస్తే అనుమానం వస్తుందని చెప్పి.. అక్కడ్నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లి.. హైదరాబాద్‌కు వస్తున్నట్లు నిర్ధారణ అయింది.
థాయిలాండ్‌లో 2022 నుంచి గంజాయి సాగును అధికారికంగా సాగు చేస్తున్నారు. గంజాయి సాగుపై వారు నిషేధం ఎత్తేశారు. అప్పట్నుంచి ఇండియాలోని కొందరు స్మగ్లర్లు సిండికేట్‌గా ఏర్పడి.. హవాలా మార్గంలో గంజాయి దందా కొనసాగిస్తున్నారు. నేరుగా బ్యాంకాక్ నుంచి ఇండియాకు రాకుండా వయా దుబాయి నుంచి హైదరాబాద్‌కు వచ్చి గంజాయి విక్రయాలు కొనసాగించి కోట్ల రూపాయాలు దండుకుంటున్నట్లు తెలుస్తోంది.