బంజారాహిల్స్,జూలై 25: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనానికి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ సర్కిల్-18 పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, షేక్‌పేట డివిజన్ల పరిధిలో వర్షాకాలంలో సహాయక చర్యలను నిర్వహించేందుకు 4 మాన్సూన్ బృందాలు విధులు నిర్వహిస్తున్నాయి. ఒక్కో బృందంలో నలుగురు సిబ్బంది పనిచేస్తున్నారు. తెల్లవారుజామున 5గంటల నుంచే క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను చేపడుతున్నారు. సర్కిల్ – 18 పరిధిలో 21 ప్రాంతాలను వాటర్ లాగింగ్ పాయింట్స్‌గా గుర్తించారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2లోని కేబీఆర్ పార్కు, బంజారాహిల్స్ రోడ్డు నంబర్3లోని షేక్‌పేట మండల కార్యాలయం , బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లోని జహీరానగర్ చౌరస్తా సమీపంలోని అల్ కరీమ్ హోటల్, స్టార్ ఆస్పత్రి, జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36లోని నీరూస్ చౌరస్తా, పెద్దమ్మ గుడి చౌరస్తా, జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45, జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 51 సమీపంలోని హుడా హైట్స్, బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1, 12 చౌరస్తా, కమాండ్ కంట్రోల్, జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 92లోని మైలాన్, జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 1లోని సీవీఆర్ చానెల్ చౌరస్తా తదితర ప్రాంతాలతో పాటు ఇందిరానగర్, జవహర్‌నగర్, సింగాడకుంట, ఉదయ్‌నగర్, ఫిలింనగర్‌లోని బీజేఆర్నగర్, వినాయక్‌నగర్, బాల్‌రెడ్డినగర్, వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని దేవరకొండ బస్తీ, శ్రీనగర్ కాలనీ , బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1లోని జలగం వెంగళరావు పార్కు తదితర ప్రాంతాలలో అత్యధికంగా వరదనీరు నిలుస్తుందన్నారు. ఆ ప్రాంతాలపై జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారు. భారీ వర్షాలు కురిసిన సమయంలో ఆయా ప్రాంతాలవద్ద రెయిన్ వాటర్ క్యాచ్పిట్స్లో అడ్డంకులు లేకుండా చూస్తున్నారు. ఈ చర్యలవల్ల వర్షం తగ్గిన కొద్దిసేపటికే వరదనీరు సాఫీగా వెళ్తుండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు.
సోమవారం సాయంత్రం ప్రారంభమైన భారీ వర్షం మంగళవారం ఉదయం దాకా కొనసాగింది. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని సీఎంటీసీ వద్ద 6.5సెంమీ వర్షపాతం నమోదైంది. పంజాగుట్టలోని సెస్ వద్ద 6.4సెంమీ, ఫిలింనగర్‌లోని గౌతమ్‌నగర్ వద్ద 5.9సెంమీ, జూబ్లీహిల్స్‌లో 5.8సెంమీ, శ్రీనగర్ కాలనీలో 5.1 సెంమీ, డా.ఎంసీహెచ్ఆర్డీలో 4.9సెంమీ, వెంకటేశ్వరకాలనీ 4.7సెంమీ, ఖైరతాబాద్‌లోని గణాంకభవన్‌లో వద్ద 2.8సెంమీ వర్షపాతం నమోదైంది. కాగా మంగళవారం సాయంత్రం 5గంటల నుంచి ప్రారంభమైన వర్షం రాత్రంతా కొనసాగింది.
భారీ వర్షాలతో నగరవ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి అత్యవసర పరిస్థితి ఏర్పడినా సంబంధిత ప్రాంతంలోని అధికారులను అప్రమత్తం చేసేందుకు ఇటీవల వైర్లెస్ సెట్లను వినియోగిస్తున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ స్థాయి నుంచి క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించే డీఈ స్థాయి అధికారి వరకు వైర్లెస్ సెట్స్‌తో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జీహెచ్ఎంసీ సర్కిల్ -18 పరిధిలో గత మూడురోజుల్లో వరదనీటికి సంబంధించి దాదాపు 8 ఫిర్యాదులు వచ్చాయని, వెంటనే అక్కడకు మాన్సూన్ సిబ్బందిని పంపించి పరిష్కరించామని ఈఈ విజయ్‌కుమార్ తెలిపారు.