సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 27 (నమస్తే తెలంగాణ): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలకు వరద క్రమేణా పెరుగుతున్నది. ఈ క్రమంలో రెండు రోజుల కిందటి వరకు రెండు రిజర్వాయర్ల వద్ద రెండు చొప్పున గేట్లను వదిలి దిగువన మూసీలోకి నీటిని వదిలిన అధికారులు… తాజాగా గురువారం మరో రెండు చొప్పున గేట్లను ఎత్తారు. ఎగువ నుంచి వస్తున్న వరద తీవ్రత పెరిగిన క్రమంలో అధికారులు అవుట్‌ఫ్లోను కూడా పెంచారు. హిమాయత్‌సాగర్‌కు 2200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో అధికారులు గురువారం సాయంత్రం 4.30 గంటలకు మరో రెండు గేట్లను ఎత్తి నాలుగు గేట్ల ద్వారా దిగువకు 2,750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
మరోవైపు ఉస్మాన్‌సాగర్‌కు సైతం భారీగా వరద నీరు వస్తున్నది. ఇప్పటికే ఈ రిజర్వాయర్ రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. తాజాగా అధికారులు మధ్యాహ్నం 3 గంటలకు మరో రెండు గేట్లను ఎత్తి అవుట్‌ఫ్లోను పెంచారు. ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్‌కు రెండు వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, నాలుగు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి దిగువకు 852 క్యూసెక్కులను వదులుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు జలాశయాలకు ఎగువ నుంచి 4,200 క్యూసెక్కుల వరద వస్తున్నందున అధికారులు దిగువకు 3,602 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మూసీలోకి వరద పెరగడంతో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని జలమండి ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు.