మేడ్చల్, మార్చి27(నమస్తే తెలంగాణ): డబుల్ బెడ్రూమ్లలో చేరని లబ్ధిదారులకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నెలఖరు వరకు జిల్లా పరిధిలో డబుల్ ఇండ్లలో చేరని దాదాపు 7,864 లబ్ధిదారుల ఇండ్ల రద్దుకు చర్యలు తీసుకోనున్నారు. లబ్ధిదారులు అడ్రస్‌లకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడంతో పాటు వారి సెల్ఫోన్లకు సమాచారం పంపిస్తున్నారు. దీంతో డబుల్ బెడ్రూమ్లలో చేరని లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. డబుల్ బెడ్రూమ్లలో ఉండకుండా అద్దెకు ఇచ్చినవారిని గుర్తించి ఇప్పటికే వారికి హెచ్చరికలు జారీ చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 16 డబుల్ బెడ్రూమ్ కాలనీలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి లబ్ధిదారులకు కేటాయించిన విషయం తెలిసిందే. ఇందులో దాదాపు 30,068 ఇండ్లకు గాను 29,101 ఇండ్లను కేటాయించంగా 20,391 మంది లబ్ధిదారుల మాత్రమే డబుల్ బెడ్ రూమ్కాలనీలలో నివాసం ఉంటున్నారు. ఆయా ఇండ్లలో ఉండనివారికి ఇప్పటికే రెండు మార్లు నోటీసులు జారీచేసామని మూడవసారి నోటీసుల జారీ చేస్తున్నామని, అయినప్పటికీ స్పందించనట్లయితే ఇండ్లను ప్రభుత్వ ఆదేశాల మేరకు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈనెల చివరి వరకు ఆయా ఇండ్లలో చేరని లబ్ధిదారుల ఇండ్లను రద్దుచేసి అర్హులైన నిరుపేదలకు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు. కొందరు లబ్ధిదారులు ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలలో విధులు నిర్వహించడం వల్ల డబుల్బెడ్రూమ్లకు చేరలేకపోతున్నామని, అంతేకాక శివారు ప్రాంతాలలో కాలనీలు ఉన్నందున బస్సు సౌకర్యం లేకపోవడం ఒకింత కారణమని అందుకే చేరలేకపోతున్నట్లు ఆవేదన చెందుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు సొంతింటి కళ నేరవేర్చేలా మంచి ఉద్దేశ్యంలో నిర్మించిందని, లబ్ధిదారుల కేటాయింపు అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ కాలనీలలో సౌకర్యాలు కల్పించడంలో విఫలైమందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
డబుల్ బెడ్రూమ్లలో చేరని లబ్ధిదారులు తమకు మరికొంత సమయం ఇవ్వాలని అధికారులను కోరుతున్నారు. నోటీసులు ఇచ్చి తమను ఆందోళనకు గురిచేయవద్దని తమకు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికి తోడు డబుల్ బెడ్రూమ్ కాలనీలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో వేరే ప్రాంతాల్లో ఉండాల్సి వస్తోందని.. బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.