మేడ్చల్, సెప్టెంబర్ 10 : అభివృద్ధిలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితో హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తున్నాయన్నారు. మేడ్చల్ పట్టణానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, యువకులు ఆదివారం మంత్రి మల్లారెడ్డి సమక్షంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉద్యమ నేత కేసీఆర్ స్వరాష్ట్రంలో పాలన పగ్గాలు చేపట్టి, రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రతి పల్లె పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతుందన్నారు. ఇంటింటికీ స్వచ్ఛమైన నీటిని ఇచ్చిన ఘనత కూడా సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు కింద ఎకరాకు రూ.10వేలు ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదన్నారు. కుల వృత్తులకు తోడ్పాటునిస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణనే అన్నారు. దళితబంధుతో దళితులు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఐటీ పరిశ్రమ రాకతో ఎంతో మంది యువతకు ఉపాధి లభించిందని తెలిపారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో విజయం సాధించి, హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు.
మంత్రికి ఘన స్వాగతం..
మేడ్చల్‌లో నిర్వహించిన చేరికల కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి మల్లారెడ్డికి బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయం నుంచి వివేకానంద విగ్రహం వరకు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి చామకూర మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మందితో ర్యాలీ నిర్వహించారు. మంత్రి ప్రచార రథంపై వస్తుండగా.. బీఆర్ఎస్ శ్రేణులు నూతనోత్సాహంతో గులాబీ జెండాలు, మంత్రి మల్లారెడ్డి చిత్ర పటాల ప్లకార్డులతో ముందుకు సాగారు. అనంతరం వివేకానంద కూడలి వద్ద ఏర్పాటు చేసిన వేదికపై మంత్రి మెడలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ పూలదండ వేసి, గదను బహూకరించారు. అనంతరం బీఆర్ఎస్లో చేరిన వారి మెడలో మంత్రి గులాబీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు రఘు, మణి, మనోజ్, నాగరాజు, టిల్లు, పవన్‌తో పాటు 250 మంది బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మర్రి దీపికానర్సింహ రెడ్డి, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు నారెడ్డి నందారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ చీర్ల రమేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీర్ల దయానంద్ యాదవ్, మున్సిపాలిటీ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కీసర మండలంలో భారీగా యూత్ చేరిక
కీసర, సెప్టెంబర్ 10: బీఆర్ఎస్ పార్టీలోయూత్ నాయకులు పెద్ద సంఖ్యలో చేరుతున్నారని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండలంలోని భోగారం, రాంపల్లిదాయర, అంకిరెడ్డిపల్లి గ్రామాల నుంచి సుమారు 100 మంది యువ నాయకులు ఆదివారం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. యూత్ నాయకులకు మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.