సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం గాలిలో మేడలు కడుతోంది. ఉన్న సిటీ అభివృద్ధి మరిచి కాగితాలకే పరిమితమైన ఊహానగరి(ఫ్యూచర్ సిటీ)కి వెంపర్లాడుతోంది. నిత్యం లక్షలాది మంది నివసించే ప్రాంతాలను మరిచి జనావాసాలు లేని ప్రాంతానికి మెట్రో పరుగులు పెట్టిస్తామని గొప్పలు పోతున్నది. విశ్వనగరం అంటే అధునాతన మౌలిక సదుపాయాలు, మెరుగైన రవాణా అవకాశాలు ఉంటే తప్పా..
విదేశీ తరహా జీవన విధానం కనిపించదని భావించిన బీఆర్ఎస్ నగరాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తే, వాటికి విరుద్ధంగా ఉన్న ప్రణాళికలను కాలరాసి, లేని ప్రాంతాలకు అందలమెక్కిస్తూ నట్టేట ముంచేందుకు సిద్ధమవుతున్నది కాంగ్రెస్ సర్కారు. మెట్రో విషయంలో నగరం నలుమూలాల నుంచి రాకపోకలు చేసేందుకు వీలుగా.. విస్తరణ ప్రణాళికలను రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ ప్రాధాన్యతనిస్తే.. రేవంత్ సర్కారు మాత్రం రియల్ భూముల పేరిట, స్వప్రయోజనాల కోసం కాగితాలకే అభివృద్ధి ప్రణాళికలతో మార్కెటింగ్ జిమ్మికులకు దిగుతున్నది. దీంతో నగరంలో అందుబాటులోకి రావాల్సిన మెట్రో మార్గాలు.. ఫ్యూచర్ సిటీ కారణంగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.
గాలిలో మేడలు..
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం ఎన్నో ప్రణాళికలను సిద్ధం చేసింది. ప్రధానంగా మెట్రో విస్తరణ విషయంలో స్పష్టమైన వైఖరితో ప్రణాళికలను రూపొందించింది. ప్రస్తుతం 70 కిలోమీటర్ల మేర ఉన్న మెట్రో వ్యవస్థను శివారు ప్రాంతాలకు విస్తరించి, నిత్యం లక్షలాది మంది ప్రయాణికులకు మెరుగైన రవాణా వ్యవస్థను తీర్చిదిద్దాలనుకున్నది.
ఇందు కోసమే రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు, లక్డీకాపూల్ నుంచి గచ్చిబౌలి, మెట్టు గూడ నుంచి ఈసీఐఎల్, జేబీఎస్ నుంచి శామీర్‌పేట, ప్యారడైజ్ నుంచి సుచిత్ర మార్గంతోపాటు, మియాపూర్ టు పటాన్చెరు ప్రాంతాలకు మెట్రో మార్గాలను నిర్మించాల అనుకున్నారు. వీటితో ప్రస్తుతం కోర్ సిటీ నుంచి లక్షలాది మంది రాకపోకలు సాగించే వారికి వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని భావించి.. ఎన్నికల సమయంలోనూ మెట్రో విస్తరణపై స్పష్టమైన వైఖరితో వ్యవహరించింది. కానీ అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నగరాభివృద్ధికి కీలకమైన ప్రతిపాదనలు తుంగలో తొక్కి… గాలిలో మేడలు కట్టేందుకు సిద్ధమైంది.
ప్రజాప్రయోజనాలకు మంగళం…
కోర్ సిటీ నుంచి శివారు ప్రాంతాల వరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం లక్షలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం అవుటర్ రింగు రోడ్డు, లేదా ఎంఎంటీఎస్ వంటి సౌకర్యవంతమైన మార్గాలే ఉన్నాయి. వీటికంటే మరింత వేగవంతమైన రవాణా వ్యవస్థ కోసం నగరం నలువైపులా మెట్రో విస్తరించాలని బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఈ క్రమంలో నిత్యం 30 లక్షల జనాభా ఉండి, కోర్ సిటీకి 5-6లక్షల మంది రాకపోకలు సాగించే నార్త్ సిటీ ప్రాంత అభివృద్ధి ప్రాధాన్యతనిస్తూ.. మెట్రో విస్తరణ ప్రణాళికలు రూపొందించింది. దీనికోసం శామీర్‌పేట, సుచిత్ర, ఈసీఐఎల్తోపాటు, నార్త్ వెస్ట్‌లోని పటాన్చెరు మార్గాలను, ఈస్ట్ సిటీలో ఘట్కేసర్ వరకు, రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు మెట్రోను విస్తరించి ప్రజలకు ప్రయోజనం కలిగించే రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయాలని భావించింది.
కానీ అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రజావసరాలకు పాతరేసి ప్రణాళికలను చిన్నాభిన్నం చేసింది. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు అవసరమే లేని ప్రాంతానికి మెట్రో లైన్ వేసేందుకు సిద్ధమైంది. రాయదుర్గం మీదుగా శంషాబాద్ వరకు నిత్యం లక్షలాది మందికి ఉపయోగపడే ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్‌మెంట్‌ను మార్చి… నాగోల్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట మీదుగా ఎయిర్‌పోర్టు చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. అదేవిధంగా జన సంచారమే లేని ఫ్యూచర్ సిటీ కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఆలైన్‌మెంట్‌లో మార్పులు చేసి… జనాలకు దూరంగా మెట్రో నిర్మిస్తామని ప్రకటించింది.
ఊహానగరికి మెరుపులు..
కలల ప్రపంచంలో జనాలను తేలియాడేలా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం… ఫ్యూచర్ సిటీని కూడా ఊహాత్మక ప్రకటనలతో పబ్బం గడుపుతోంది. నిత్యం లక్షలాది మంది రాకపోకలు సాగించే ప్రాంతాలకు మెట్రో విస్తరణను నిర్లక్ష్యం చేస్తోంది. ఎంతో కీలకమైన మెట్టుగూడ-ఈసీఐఎల్, రాయదుర్గం నుంచి శంషాబాద్, జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వంటి మార్గాలకు రావాల్సిన మెట్రో వెనుకబడి పోతున్నది. రెండో దశ విస్తరణ పేరిట ఫ్యూచర్‌కి మెట్రోను ప్రకటించిన రేవంత్ రెడ్డి… గత కొన్నేళ్లుగా మెట్రో కోసం పడిగాపులుగాస్తున్న నార్త్ సిటీ ప్రజల అవసరాలను గుర్తించలేకపోయారు. నార్త్ సిటీ మెట్రో ద్వారా కోర్ సిటీకి నిత్యం 5-6లక్షల మంది ప్రయాణించే వెసులుబాటు ఉన్నా… ఈ ప్రాజెక్టును కనీసం విస్తరణ జాబితాలో చేర్చలేదు. ఎన్నో ఆందోళనలు, ఎంతోమంది నార్త్ సిటీ వాసులు నిరసనలతో రోడ్డెక్కితే గానీ నార్త్ సిటీకి చోటు కల్పించలేదు.
డీపీఆర్కే దిక్కు లేదు…
ఫేస్-2 పార్ట్ బీగా నార్త్ సిటీ మెట్రోకు డీపీఆర్ రూపకల్పన చేసి మార్చి నెలాఖరులోగా కేంద్రానికి పంపుతామంటూ సర్కారు ప్రకటన చేసింది. కానీ ఇప్పటివరకు డీపీఆర్‌కు దిక్కు లేకుండా పోయింది. అదే ఫ్యూచర్ సిటీకి మాత్రం హడావుడిగా సమీక్షలు నిర్వహించి… మెట్రో పరుగులు పెట్టినంత ప్రచారం చేసుకుంటోంది. ఈ ప్రాజెక్టుతో జనాలకు ఒరిగేదేమీ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంటే.. ప్రస్తుతం నగరవాసులకు అవసరమైన కీలకమైన ప్రాజెక్టులను చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు.
ఎన్నో ఏళ్లుగా లక్డీకాపూల్ నుంచి మెహదీపట్నం మీదుగా ఐటీ కారిడార్ వెళ్లేందుకు మెట్రో నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర నుంచి ఒక్కసారి ఈ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించలేదు. కనీసం ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా ఇప్పటివరకు చర్చించలేదు. కానీ అవసరమే లేని ఫ్యూచర్ సిటీ కోసం మాత్రం కాంగ్రెస్ సర్కారు చూపుతున్న ఉత్సాహం ఎందుకనేది ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఖజానా లేకున్నా… ప్రణాళికలతో సరి
కాంగ్రెస్ సర్కారు ఖాళీ ఖజానాతో ఈ ప్రాజెక్టులు ఎలా చేపడుతుందనేది ఇప్పుడు అంతు చిక్కడం లేదు. అందుకే రెండో దశ మెట్రో విస్తరణకు రూ. 24వేల కోట్ల అంచనాతో ప్రణాళికలు సిద్ధం చేసినా… ఇందులో కేంద్రం నుంచి ఇతర ఆర్థిక సంస్థలు ముందుకు వచ్చి సాయం అందిస్తే తప్పా ప్రాజెక్టును మొదలుపెట్టే అవకాశం లేదు. కానీ ప్రభుత్వం మాత్రం కాగితాలపై ప్రణాళికలతో సరిపెడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.