గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 12, 2020 , 02:01:17

సమ్మెకాలం వేతనంతో సంబురాలు

సమ్మెకాలం వేతనంతో సంబురాలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: 55 రోజుల సమ్మె కాలం జీతాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందనే వార్త ప్రతీ ఉద్యోగిలో సంతోషాన్ని నింపింది. ప్రసార సాధనాలు వీటిని బుధవారం ప్రచారం చేయడంతో కండక్టర్లు, డ్రైవర్లలో ఆనందం వెల్లవిరిసింది. ఇచ్చిన మాట తప్పని కేసీఆర్‌ చెప్పినవిధంగానే వేతనాలు విడుదల చేశారు. బడ్జెట్‌ లో రూ.1,000 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం అం దులో నుంచి సమ్మెకాలం వేతనాల కోసం రూ.325 కోట్లు విడుదల చేయడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకాలు, స్వీట్ల పంపిణీ చేసుకున్నారు. పరస్పరం ఆలింగనం చేసుకుని జేజేలు పలికారు. కొంతమంది నాయకుల మాటలునమ్మి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేయడంతో వీగిపోయింది. రవాణాశాఖ, ఆర్టీసీ ఆధ్వర్యంలో బస్సులు నడుపడంతో సమ్మె  విరమించాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ కండక్టర్లు, డ్రైవర్లు డిపోల వద్ద ధర్నాలు కూడా చేపట్టారు. ఐనప్పటికీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఉద్యోగులకు అన్యాయం చేయవద్దనే ఉద్దేశంతో విధుల్లోకి తీసుకుని న్యాయం చేశారు. ప్రగతిభవన్‌కు ఆహ్వానించి కార్మికులతో మాట్లాడి వరాలు కురిపించారు. మహిళా ఉద్యోగులకు రాత్రి డ్యూటీ లేకుండా 8 గంటల డ్యూటీ మాత్రమే కచ్చితంగా ఉండేలా ఆదేశాలు జారీచేశారు. కార్మిక సంఘాలతో ఆర్టీసీ నష్టం జరుగుతుందని భావించి వెల్ఫేర్‌బోర్డులు ఏర్పాటు చేపించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60సంవత్సరాలకు పెంచుతామని ప్రకటించి అమల్లోకి తెచ్చారు. సమ్మెకాలం జీతం కూడా ఇస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి ఏది చెప్పారో, ఎటువంటి హామీ ఇచ్చారో అన్నింటినీ అమలు పరిచారు. చివరగా సమ్మె కాలం జీతాన్ని  కూడా చెల్లించడంతో ఆర్టీసీ ఉద్యోగులు సంబురాల్లో మునిగిపోయి సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు. ఒక్కో కార్మికుడికి రూ.60 నుంచి లక్ష రూపాయలు అందనున్నట్లు అధికారులు తెలిపారు.

36 డిపోల్లో సంబురాలు

గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌తోపాటు రంగారెడ్డి జిల్లా రీజియన్‌లో అన్ని డిపోల్లో ఉద్యోగులు సంబురాలు జరుపుకున్నారు. ప్రతీ డిపోలో ఆర్టీసీ కార్మికులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గ్రేటర్‌ పరిధిలో 29 డిపోలతోపాటు, రంగారెడ్డి రీజియన్‌లో 7 డిపోల్లో సంబురాలు జరుపుకున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉన్న  18 వేల మంది ఉద్యోగులు, రంగారెడ్డి రీజియన్‌లో ఉన్న 3 వేల మంది ఉద్యోగులకు సమ్మె కాలం జీతం రానుంది. ఇప్పటికే సంస్థలో చేపట్టిన సంస్కరణలతో ఇబ్బంది లేకుం డా ఉద్యోగాలు చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు జీతంరావడం తో పట్టరాని సంతోషంలో ఉన్నారు. ఈ నిర్ణయంపై సూపర్‌వైజర్‌ అసోసియేషన్‌ నాయకురాలు సుధ ఆధ్వర్యంలో ఎంజీబీఎస్‌ స్టేషన్‌లో కేసీఆర్‌ నిలువెత్తు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

సమ్మెకు నాయకత్వం వహించిన వారే కేసీఆర్‌కు జేజేలు

సమ్మెకు నాయకత్వం వహించినవారే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జేజేలు పలికారు. సమ్మె కాలం జీతం చెల్లించినందుకు సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపా రు. ముఖ్యమంత్రి ఉద్యోగుల సంక్షేమం కోసం చేపడుతున్న చర్యలను కొనియాడుతున్నారు. ఉద్యోగులను సమ్మెలోకి దించిన నాయకులు సైతం కేసీఆర్‌ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులవడం గొప్ప విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. వాస్తవాలు తెలుసుకుని ముఖ్యమంత్రి చేపడుతున్న చర్యల పట్ల ఆకర్షితులవుతున్నారు.

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు: థామస్‌రెడ్డి

టీఎస్‌ఆర్టీసీ కార్మికులకు సమ్మె అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు సమ్మెకాలం వేతనం విడుదల చేయడంపై తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌(టీఎం యూ) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ థామస్‌రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రూ.235 కోట్లు కేటాయించడం  సం తోషంగా ఉందన్నారు. ఆర్టీసీ కోసం ప్రస్తుత బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు కేటాయించడం గొప్ప విషయమని చెప్పారు. కార్మికులు కేసీఆర్‌ మీద అపారమైన నమ్మకం పెట్టుకున్నారని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ పరిరక్షణ కోసం అహర్నిశలు కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. 

మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి: హన్మంతుముదిరాజ్‌

సమ్మెకాలపు వేతనం ఇస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు  తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ ప్రధానకార్యదర్శి హన్మంతు ముదిరాజ్‌, అధ్యక్షుడు సుధాకర్‌  ధన్యవాదాలు తెలిపారు.  ఆర్టీసీని బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ లను ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. సమ్మె సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు అనేక వరాలు ప్రకటించారని గుర్తు చేశారు.   

హామీ అమలుపర్చిన సీఎంకు ధన్యవాదాలు: సుధ

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కాలం జీతం నిధుల విడుదల చేసినందుకు సమ్మెకాలంలో సూపర్‌వైజర్‌ అసోసియేషన్‌ ప్రతినిధి, నాయకురాలు సుధ హర్షం వ్యక్తం చేశారు. ఆత్మీయ సమావేశంలో వెల్లడించిన విధంగా సమ్మె కాలానికి  సం బంధించిన జీతాల నిధులు ప్రభుత్వం విడుదల చేయడం తో ఎంజీబీఎస్‌లో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేసి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంచి మనస్సుకు ఇదే నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.


logo