శుక్రవారం 07 ఆగస్టు 2020
Hyderabad - Feb 14, 2020 , 04:28:47

కోహెడకు పండ్ల మార్కెట్‌

కోహెడకు పండ్ల మార్కెట్‌
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం

ఎల్బీనగర్‌, నమస్తే తెలంగాణ :  గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను కోహెడకు తరలించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్‌ పరిధిలోని అతి పెద్దదైన ఈ మార్కెట్‌ వల్ల కొత్తపేట ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్య ఎక్కువైంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌ యార్డును కోహెడకు తరలించనుండటంతో ఇక్కడ ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం లభించనున్నది. 


గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను కోహెడకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ మార్కెట్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జనార్దన్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఎన్నో ఏండ్లుగా సందిగ్ధంలో ఉన్న పండ్ల మార్కెట్‌ తరలింపు వ్యవహారం కొలిక్కి వచ్చినట్లయ్యింది. ఉమ్మడి రాష్ట్రం సమయం నుంచి ఈ మార్కెట్‌ తరలింపు వ్యవహారం ప్రతి ఎన్నికల్లోనూ వాగ్ధానంగా మారింది. అయితే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శాశ్వత పరిష్కారానికి పూనుకున్నది. తొలి తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పండ్ల మార్కెట్‌ను నగర శివారులోని కోహెడకు తరలించాలని ప్రతిపాదన చేశారు. తర్వాత స్థల నిర్ధారణ చేసినప్పటికీ తాజా ఉత్తర్వులతో ఈ కల సాకారం కానున్నది. ఉమ్మడి రాష్ట్రంలో జాంబాగ్‌లోని పండ్ల మార్కెట్‌ను ఆనాటి రద్దీ పరిస్థితుల నేపథ్యంలో నగర శివారు ప్రాంతంగా ఉన్న కొత్తపేటలో (1986లో) 22 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పారు. హైదరాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పరిధిలో పండ్ల మార్కెట్‌ కొనసాగింది. ఈ మార్కెట్‌లో పాత 97 దుకాణాలు (ఏ క్లాసు 36, బీ క్లాసు 24, సీ క్లాసు 37) ఉండగా.. డీ క్లాసులో మరో 41 షాపులు నిర్మించారు. పెరిగిన ఉత్పత్తి, రవాణా, ఎగుమతి కారణంగా మార్కెట్‌ యార్డు వెనుకభాగంలోని బిడ్డింగ్‌ యార్డులపైన మరో 75 దుకాణాలు నిర్మించారు. హైదరాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ మార్కెట్‌ 2006లో ప్రత్యేక మార్కెట్‌ గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్‌గా ఏర్పడింది. 


నగరాభివృద్ధిలో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌గా విస్తరించడంతో శివారు ప్రాంతంగా ఉన్న కొత్తపేట నగరం నడిమధ్యలో ఉన్నట్లుగా రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలో మార్కెట్‌కు ప్రతి వేసవి మామిడి సీజన్‌లో ప్రతి రోజూ 800 నుంచి 1000 వరకు భారీ, చిన్న లారీలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో జాతీయ రహదారితో పాటు సర్వీసు రోడ్డు, కాలనీ రహదారులన్నీ పండ్లతో వచ్చే భారీ వాహనాల పార్కింగ్‌తో నిండిపోతున్నాయి. ట్రాఫిక్‌ రద్దీ నేపథ్యంలో స్థానికులకు ఇక్కట్లు పెరిగాయి. దీంతో మార్కెట్‌ తరలింపు అనివార్యమైంది. అందుకే టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత జనం సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కోహెడలో 178.09 ఎకరాల్లో సరికొత్త మార్కెట్‌కు శ్రీకారం చుట్టింది. సర్వే నం.507లో 59.83 ఎకరాలు, 548లో 118.26 ఎకరాల భూ సేకరణ చేశారు. ఈ మొత్తం భూమిని మార్కెట్‌ నిర్మాణానికి కేటాయించారు. తాజాగా ఉత్తర్వుల ద్వారా కోహెడలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పండ్ల మార్కెట్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ ప్రక్రియ ద్వారా పండ్ల వ్యాపారం మరింతగా పెరుగనున్నది. దీంతో పాటే ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం కానున్నది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు పక్కనే కొత్త మార్కెట్‌ ఏర్పడుతుండడంతో సరుకు తీసుకొచ్చే రైతాంగానికి ఎంతో ఊరట లభించనున్నది.   


logo