Ganja | హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జీఆర్పీ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఒడిశాలోని రాయగడ నుంచి మహారాష్ట్ర రాజధాని ముంబై నగరానికి భారీగా గంజాయి తరలిస్తుండగా, స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తుల నుంచి 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ రూ. 9.4 లక్షలుగా ఉంటుందని పోలీసులు తెలిపారు.
గంజాయి తరలిస్తున్న వారిని అజయ్ కుమార్(35), రాణిదేవి(40)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ కూడా బీహార్‌లోని నలంద ఏరియాకు చెందిన వారని తెలిపారు. ఈ గంజాయి స్మగ్లింగ్‌లో ప్రధాన సూత్రధారి పంకజ్(ఒడిశా) పరారీలో ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు.
అజయ్ కుమార్, రాణిదేవి కలిసి గంజాయిని తరలించేందుకు ప్రతి ట్రిప్‌కు రూ. 5 వేలు తీసుకుంటున్నారు. ఒడిశాలోని మునిగూడ ఫారెస్ట్ ఏరియాలో పంకజ్ నుంచి గంజాయిని తీసుకొని, ముంబైకి రైల్లో తరలిస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా గంజాయిని ట్రాలీ సూట్‌కేసుల్లో నింపి తరలిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. వీరిద్దరూ ముంబై ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. సికింద్రాబాద్ స్టేషన్లో తాము ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించే సరికి గంజాయి బయటపడిందని పోలీసులు తెలిపారు.