కూల్చివేతలు చేయబోమంటూనే అధికారులు మూసీ పరీవాహక ప్రాంతాల్లో నిర్వాసితుల ఇండ్లను మంగళవారం కూల్చేశారు. సైదాబాద్‌లో ఉద్రిక్తతల మధ్య రెడ్ మార్క్ చేసిన ఇండ్లను నేలమట్టం చేశారు. గల్లీలు చిన్నవి కావడంతో బుల్డోజర్లు, జేసీబీలు వెళ్లలేకపోవడంతో 50 మంది లేబర్లను రంగంలోకి దించారు. వాళ్లంతా సుత్తెలు, గడ్డపారలు తదితర సామగ్రిని ఉపయోగించి గోడలు, కప్పులను భూస్థాపితం చేశారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : తమ కండ్ల ముందే ఇండ్లు కూలిపోవడం చూసిన బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. కూల్చొద్దు సారూ అంటూ వేడుకున్నారు. తమ సామగ్రిని తీసుకోవడానికి సమయం ఇవ్వాలని కొందరు అధికారులకు విజ్ఞప్తి చేశారు. కూలుతున్న ఇంటిలో నుంచి సామగ్రి తీసుకుంటున్న దృశ్యాలు ప్రతి ఒక్కరిని కదిలించాయి. చిన్నారులు సైతం వారి వస్తువులను తీసుకుంటూ మా ఇంటిని కూల్చొద్దంటూ అధికారుల వద్ద ప్రాధేయపడ్డారు.
కాగా, బాధితుల అరణ్య రోదన పట్టించుకోని రేవంత్ సర్కార్ కూల్చివేతలను ప్రారంభించి నిర్వాసితుల్లో భయం నింపారు. అడుగడుగునా బాధితులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. పోలీసుల పహారాలో ఇండ్లను భూస్థాపితం చేశారు. సైదాబాద్ మండలం మూసీ పరీవాహక ప్రాంతంలో 150 ఇండ్లను అధికారులు నేలమట్టం చేశారు. ఇప్పటి వరకు అధికారులు 1595 నిర్మాణాలను రివర్‌బెడ్‌లో గుర్తించారు.
ఇందులో 940 ఇండ్లకు ఆర్బీ ఎక్స్ మార్క్ చేసినట్టు ఆర్డీఓ మహిపాల్ తెలిపారు. కాగా, శంకర్‌నగర్‌లోని మూసీ రివర్ బెడ్లో భారీ పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు చేపట్టిన కూల్చివేతలు సైతం తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. షేక్‌పేట తాసీల్దార్ అనితారెడ్డి, హిమాయత్‌నగర్ తాసీల్దార్ సంధ్యారాణి, వెస్ట్ మారేడ్‌పల్లి తాసీల్దార్ బీమయ్యగౌడ్ల ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు.