మూసాపేట, జూలై 8: కల్తీ కల్లు తాగి నలుగురు మహిళలు, ఏడుగురు పురుషులు అస్వస్థకు గురైన ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. హెచ్ఎంటీ హిల్స్ లోని కల్లు కాంపౌండ్ లో కల్లు తాగిన జేఎన్టీయూ అడ్డగుట్టకు చెందిన యోబు, మియాపూర్ నందిగడ్డ తండాకు చెందిన దేవదాస్, గూగుల్ ఫ్లాట్స్ 9th ఫేస్‌కు చెందిన పోచవ్వ, జేఎన్టీయూకు చెందిన చాకలి లక్ష్మి, షంషీగూడ కు చెందిన గోవిందమ్మ, పెంటీశ్, శాతవాహన నగర్ చెందిన యాదగిరి, నరసింహ, మాధవి, మొనప్ప, ఇంద్ర హిల్స్ కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన కోటేశ్వరరావు అస్వస్థకు గురయ్యారు.
వారిని కూకట్‌పల్లిలోని రాందేవ్ రావ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాలానగర్ డీసీపీ సురేశ్ కుమార్ కూకట్పల్లి ఏసీపీ రవి కిరణ్ రెడ్డి, సీఐ కేవీ సుబ్బారావు ఆస్పత్రికి చేరుకొని విచారించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాధరం కృష్ణారావు బాధితులను పరామర్శించారు.