సిటీబ్యూరో, జనవరి 13 (నమస్తే తెలంగాణ): నిషేధిత చైనా మంజాలపై(Chinese manjas) నగర టాస్క్‌ఫోర్స్ విభాగం, స్థానిక పోలీసులతో కలిసి నాలుగు నెలల్లో 107 కేసులు నమోదు చేసిందని టాస్క్‌ఫోర్స్ డీసీపీ సుధీంద్ర తెలిపారు. ఈ మేరకు సోమవారం టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ శ్రీనివాస్‌రావు విలేకరుల సమావేశంలో వవరాలను వెల్లడించారు. సింథటిక్ నైలాన్, గ్లాస్ కోటింగ్‌తో తయారు చేసిన పతంగుల దారాలతో మనిషులతో పాటు జంతువులు, పక్షుల ప్రాణాలకు హాని జరుతుందని, ఈ నేపథ్యంలో చైనా మంజాలపై నిషేధం ఉందన్నారు.
అయినా కూడా కొందరు వ్యాపారులు చైనా మంజాలను తెచ్చి విక్రయిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే గత అక్టోబర్ నెల నుంచి జనవరి 13వ తేదీ వరకు నగరంలోని ఏడు జోన్లలో స్థానిక పోలీసులతో కలిసి 107 కేసులు నమోదు చేసి 148ని అరెస్ట్ చేసినట్లు వివరించారు. వీరి వద్ద నుంచి రూ. 90 లక్షల విలువైన 7334 చైనా మంజా బబ్బిన్స్ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. చైనా మంజాలను ఎవరు కూడా వాడకూడదని సూచించారు.