Bank Loans | మేడ్చల్: 2024-25 ఆర్థిక సంవత్సరంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మహిళా సంఘాలకు రుణ మంజూరు లక్ష్యాన్ని గ్రామీణభివృద్ధి సంస్థ చేరుకుంటుందా అన్న అనుమనాలను మహిళా సంఘాల సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో రెండు నెలల 15 రోజుల గడువు ఉండటంతో రుణ మంజూరు లక్ష్యాన్ని పూర్తి చేసి స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించాలని మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాలకు రుణ మంజూరు లక్ష్యం రూ. 197 కోట్లు కాగా, ఇప్పటి వరకు 100 శాతం లక్ష్యంలో భాగంగా ఇప్పటి వరకు 80 శాతం మాత్రమే పూర్తయింది.
మరో రెండు నెలల 15 రోజుల గడువులో వంద శాతం బ్యాంకు లింకేజీ రుణాలు ఏ మేరకు అందిస్తారన్నది ప్రశ్నార్థకరంగా మారింది. జిల్లాలో గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2,794 స్వయం సహాయక సంఘాలు ఉండగా, ఇప్పటి వరకు 2,497 మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందించారు. మరో 297 సంఘాలకు అందించాల్సి ఉంది. మహిళా సంఘాలకు వంద శాతం రుణాల లక్ష్యాన్ని చేరుకుంటామని గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు స్పష్టం చేస్తున్నప్పటికీ అచరణలో సాధ్యమవుతుందా అన్నది తెలాల్సి ఉంది.
ఆచరణలో విఫలం..
స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులను కోటిశ్వరులను చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నట్లు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం విఫలమతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళా శక్తి పేరిట క్యాంటిన్లను ఏర్పాటు అంతగా సక్సెస్ కాలేకపోయింది. జిల్లాలోని 13 మున్సిపాలిటీలతో మరో మూడు మండలాలలో క్యాంటీన్ల ఏర్పాటు చేస్తామని చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు రెండు మించి మహిళా క్యాంటీన్లు ఏర్పాటు కాలేదు. మహిళా సంఘాల ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 85 వేల మంది విద్యార్థులకు యూనిఫాంలు కుట్టించిన వారికి సగం మాత్రమే చెల్లించి.. మిగతా బిల్లులను పెండింగ్లో ఉంచారు.
వ్యక్తిగత రుణాలు మంజూరు చేస్తామని..
జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాల సభ్యులకు రూ. 51 కోట్ల వరకు వ్యక్తిగత రుణాలు మంజూరు చేస్తామని ప్రకటించినా.. ఇప్పటి వరకు ఆచరణలో అమలుకు నోచుకోలేదు. వ్యక్తిగత రుణాలు మంజూరు చేస్తే మహిళలు వివిధ వ్యాపారాల్లో రాణించే అవకాశం ఉన్నందున.. వ్యక్తిగత రుణాలను మంజూరు చేస్తే బాగుంటుందని మహిళా సంఘాల సభ్యులు పేర్కొంటున్నారు. మహిళా సంఘాల సభ్యులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్లయితే మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశమున్నది.