నగరంలో శాంతి భద్రతలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. వరుసగా జరుగుతున్న ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా సోమవారం ఒకేరోజు వేర్వేరు చోట్ల ఇద్దరు హత్యకు గురికావడం భయాందోళనకు గురిచేస్తున్నది. కూకట్‌పల్లిలో పట్టపగలే ఇంట్లోకి చొరబడిన ఆగంతకులు బాలికను అత్యంత దారుణంగా హత్య చేయగా, నాగారంలో రిహాబిటేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తిని చంపేశారు.
మూసాపేట, ఆగస్టు 18 : పట్టపగలు ఇంట్లోకి చొరబడి గుర్తుతెలియని వ్యక్తులు పన్నెండేండ్ల బాలికను దారుణంగా పొడిచి చంపారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఈ బాలికను కృరంగా చంపాల్సిన అవసరం ఎవరికొచ్చింది, దొంగలా? తెలిసిన వారా? అనే విషయంపై దర్యాప్తు సాగుతున్నది. ఘటన స్థలంలో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో హంతకులు ఈజీగా అక్కడి నుంచి తప్పించుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సంగీత్‌నగర్‌లో జరిగిన ఈ ధారుణ ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా ముక్తక్యాసరం ప్రాంతానికి చెందిన రేణుక, కృష్ణ దంపతులు కూకట్‌పల్లిలోని సంగీత్‌నగర్‌లో నివాసముంటున్నారు. గత రెండేండ్లుగా అక్కడ ఓ అపార్టుమెంట్‌లోని పెంట్‌హౌస్‌లో కిరాయికి ఉంటున్నారు. రే
ణుక ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తుండగా, కృష్ణ బైక్మెకానిక్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కూతురు సహస్త్ర(12), కొడుకు సద్విన్ ఇద్దరు పిల్లలు. సహస్త్ర కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతున్నది. సోమవారం ఉదయం 9 గంటలకు సద్విన్ను స్కూల్‌కు పంపి దంపతులిద్దరు తమ విధులకు వెళ్లారు. సహస్త్ర స్కూల్‌కు సెలవు కావడంతో ఇంట్లోనే ఒంటరిగా ఉంది.
మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కుమారుడికి లాంచ్ బాక్స్ తీసుకేళ్లేందుకు కృష్ణ ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపులు తెరిచేసరికి బెడ్రూంలో బెడ్‌పై పొట్టపై. ఛాతిపై కత్తి పోట్లతో బాలిక విగత జీవిగా పడి ఉండటాన్ని గమనించాడు. వెంటనే కూకట్పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న తల్లి రేణుక ఇంటికి వద్దకు చేరుకొని కూతురి దారుణ హత్యను చూసి సొమ్మసిల్లి పడిపోయింది. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు పనిచేయడం లేదని గుర్తించారు. డాగ్‌స్కాడ్, క్లూస్‌టీమ్‌తో ఆధారాలను సేకరించారు. బాలిక ఒంటిపై మూడు కత్తిపోట్లు ఉన్న పోలీసులు గుర్తించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలిని బాలానగర్ డీసీపీ సురేష్‌కుమార్, కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్‌రెడ్డి, సీఐ వెంకట సుబ్బారావులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.
ఇంట్లో పెంట్‌హౌస్‌లో బాలిక ఒంటరిగా ఉన్నదనే విషయం ఎవరికి తెలుసు? దొంగ తనానికి వచ్చిన వాళ్లు ఇంట్లో ఉండే సామగ్రిని అపహరిస్తారు..కానీ.. ఇక్కడ ఇంట్లో చోరీ జరుగలేదని ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. కేవలం బాలిక ఒంటరిగా ఉందనే విషయాన్ని తెలుసుకున్న వాళ్లే ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు బావిస్తున్నారు. సీసీ కెమెరాలు ఇంటి వద్ద పనిచేయడం లేదని పోలీసులు గుర్తించారు. అంటే సీసీ కెమెరాలు పనిచేయడం లేదనే విషయం అక్కడ ఉండే తెలిసిన వారికే అవగాహన ఉండే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలలో గొడవలు, పాత పగలు, వివాహేతర సంబంధాలతోనే ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి.
ఆగంతకులు బాలికపై అఘాయిత్యానికి యత్నించడం దానికి బాలిక అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆ విషయం బయటకు చెబుతుందని హత్యచేశారా? ఆయా కోణాలలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగానే మృతురాలి కుటుంబ సభ్యుల నేపధ్యాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. దాంతో పాటు తరుచు ఎవరు అక్కడికి వచ్చిపోతుంటారు. ఆ అపార్టుమెంట్లో ఉన్న వారు, ఇంటి యజమాని, ఆ అపార్టుమెంట్ వద్దకు వచ్చిపోయే వారి వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పెంట్‌హౌస్‌లో ఉండే వారి గూర్చి చుట్టూ పక్కల వారికి ఎక్కువ తెలిసి అవకాశాలు తక్కువ. అయితే పక్కాగా సమాచారం ఉన్న వారే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తూ ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఇదిలాఉండగా తండ్రిపై కూడా అనుమానాలు వ్యక్తం కావడంతో ఆయన ఆరోపణలు ఖండించారు.
నా కూతురు కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతున్నది. సోమవారం స్కూల్ లేకపోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. మేం ఇంట్లో లేనప్పుడు గతంలోనూ బాలిక ఒక్కతే ఉండేది. పాపను ఒంటరిగా చూసి చంపారు..పాపను చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలి. నా కొడుకు స్కూల్ నుంచి బాక్స్ తీసుకురాలేదని స్కూల్ నుంచి ఫోన్ రావడంతో, బాక్స్ తీసుకోవడానికి నా భర్త ఇంటికి వచ్చి చూడడంతో పాప రక్తమడుగుల్లో పడి ఉంది. మాకు ఎవరితోనూ విభేదాలు లేవు.
నాకు ఒక్కతే కూతురు నా మీద ఎందుకు అనుమానం వస్తుంది. నా కూతురిని నేను ఎందుకు చంపుతాను. ఎంత అన్యాయం నా పాను ఇంత దారుణంగా చంపారు. హంతకులను చంపితేనే మాకు మనశాంతిగా ఉంటుంది. మా పాప భయపడదు. ఒక్కతే అయినా ఇంట్లో ఉంటుంది, ఇంత దారుణంగా చంపాడు… వాడు మనిషికాదు.
నాగారంలోనూ.. కీసర: నాగారంలోని జ్యోతి రిహాబిటేషన్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కీసర సీఐ ఆంజనేయులు కథనం ప్రకారం.. వినాయక్‌నగర్‌లో నివాసముండే కృష్ణ మద్యానికి బానిసయ్యాడు. దీంతో అతడి కుటుంబసభ్యులు నాగారం ఎస్వీనగర్‌లో ఉండే జ్యోతి రిహాబిటేషన్ సెంటర్లో చేర్పించారు. కాగా, తాను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని, తొందరలోనే ఇంటికొస్తానని కృష్ణ తన భార్యతో చెప్పాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సెంటర్ యజమాని భాను అనే వ్యక్తి కృష్ణ కుమార్తెకు ఫోన్ చేసి ‘మీ తండ్రి చనిపోయాడ’ని సమాచారం ఇచ్చాడు.
హుటాహుటిన ఘటన స్థలానికి కుటుంబీకులు చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, ఈ ఘటనపై విచారణ జరిపినప్పుడు అక్కడి పేషంట్లు కృష్ణను రిహాబిటేషన్ సెంటర్ నిర్వాహకుడు ఖయ్యూం దారుణంగా కొట్టాడని వెల్లడించారు. కృష్ణను కొట్టిన ఖయ్యూం పరారైనట్లు తెలిసింది. సెంటర్లో ఉన్న రోగులను ప్రతిరోజూ ఖయ్యూం కొడుతారని మిగతా రోగులు తెలిపారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని గాంధీ దవాఖానకు తరలించారు.