హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills By-Election) పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో ఉదయం 9.30 గంటల వరకు 10.2 శాతం పోలింగ్ నమోదయింది. సాయంత్రం వరకు సమయం ఉండటంతో మందకోడిగా పోలింగ్ కొనసాగుతున్నది.
కాగా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎల్లారెడ్డిగూడ నవోదయనగర్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలంతా ఓటు వేయాలని కోరారు. షేక్‌పేటలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శకుడు రాజమౌళి ఓటు వేశారు. మరోవైపు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. స్థానికేతరులైన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు నియోజకవర్గంలో యధేచ్చగా తిరుగుతున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ అక్రమాలకు తెరతీశారు. రహమత్‌నగర్ డివిజన్ ఎస్డీపీ హోటల్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ తన అనుచరులతో హల్చల్ చేశారు. మరో పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్ పెత్తనం చలాయించారు. వెంగళరావునగర్ పోలింగ్ బూత్ వద్ద సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి భర్త మట్టా దయానంద్ ఉన్నారు. దీంతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆయనపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. పలుచోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.