Ganja | బంజారాహిల్స్, ఏప్రిల్ 27 : అడ్డదారిలో డబ్బులు సంపాదించేందుకు గంజాయి విక్రయిస్తున్న యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని ఉదయ్‌నగర్‌లో నివాసం ఉంటున్న బి.రఘు(25) సమీపంలోని స్టార్ ఆస్పత్రిలో కార్డియాలజీ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తుంటాడు. ఇటీవల రఘుకు మహారాష్ట్రలోని బీద్ జిల్లాకు చెందిన షేక్ అమ్జాద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తాను గంజాయి తీసుకువచ్చి ఇస్తానని, దాన్ని కస్టమర్లకు అమ్మితే భారీగా లాభాలు వస్తాయని అమ్జాద్ చెప్పడంతో గత కొంతకాలంగా రఘు గంజాయి విక్రయిస్తున్నాడు.
బంజారాహిల్స్ రోడ్ నెం 13లోని శ్మశానవాటిక, అంబేద్కర్ నగర్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న హెచ్ న్యూ విభాగం సిబ్బంది, బంజారాహిల్స్ పోలీసులు నిఘా పెట్టారు. నిందితుడు శ్మశానవాటికలోకి రాగానే అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీ నిర్వహించగా బ్యాగులో 1.5 కేజీల గంజాయి లభ్యమయింది. అదుపులోకి తీసుకుని విచారించగా తాను అమ్జాద్ వద్ద నుంచి గంజాయి కొని చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి అమ్ముతున్నానని, రూ.250 నుంచి రూ. 300 చొప్పున విక్రయిస్తున్నట్లు అంగీకరించాడు. ఈ మేరకు నిందితుడు రఘు వద్దనుంచి 1.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు రఘుతో పాటు షేక్ అమ్జద్ మీద ఎన్డీపీఏఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితుడు రఘును అరస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.