మాదాపూర్, నవంబర్ 20 : హైడ్రా అధికారులు చట్టవిరుద్ధంగా చేపడుతున్న చర్యల వల్ల అనేక మంది పేద ప్రజలు రోడ్డున పడ్డారని హైడ్రా బాధితులు పేర్కొన్నారు. మాదాపూర్‌లోని సియేట్ మారుతి హిల్స్ కాలనీలోని సర్వే నంబర్ 12, 12ఏ, 13 లో 15.4 ఎకరాల స్థలంలో హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా హైడ్రా అధికారులు నిర్వహణ పనులు చేపట్టడంతో సున్నం చెరువు బాధితులు బీఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి కార్తీక్ రాయలతో కలిసి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సున్నం చెరువు బాధితులకు మద్దతుగా నిలిచిన కార్తీక్ రాయల వివరాలను వెల్లడించారు.
సున్నం చెరువు ప్రజలు హైడ్రాకు, ప్రభుత్వానికి ఎలాంటి వ్యతిరేకం కాదని, ఎటువంటి కబ్జాలు చేయకుండా 20 ఏండ్లుగా నివాసాలు ఏర్పరుచుకొని జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. హైడ్రాకు కాంట్రాక్టు సిబ్బందికి ఎటువంటి సంబంధం లేని తమ ప్లాట్లలోకి చొరబడి అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా హైడ్రా కాంట్రాక్టు సిబ్బంది తమను రోడ్డున పడేశారని ఆరోపిస్తున్నారు. 1990-1992లో జస్టిస్ ఆవుల సాంబశివరావు ఇతరుల నుంచి సియేట్ సమాఖ్య సర్వే నంబర్ 12, 12, 13లోని పట్టా భూములను చట్టబద్ధంగా కొనుగోలు చేయడం జరిగిందని బాధితులు చెబుతున్నారు. 1992లో హుడా లే అవుట్‌కు ఆమోదం ఇచ్చింది. 1998లో హుడా ఫైనల్ నోటిఫికేషన్ రద్దవడంతో హుడాకి ఈ భూములపై ఎటువంటి హక్కు లేదని ధ్రువీకరించిందని తెలిపారు.
కోర్టు ఆదేశాలను ధిక్కరించడం ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి కార్తీక్ రాయల ప్రశ్నించారు. సున్నం చెరువు బాధితుల తరపున పోరాడుతున్నామన్నారు. కోర్టు న్యాయ బద్ధంగా ఉత్తర్వులు చేసినప్పటికి పత్రాలను చూపిన హైడ్రా అధికారులు బాధితులతో దుర్భాషలాడుతు ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. అక్రమ తవ్వకాలను ఫోన్లో వీడియో తీస్తుండగా హైడ్రా ఇన్స్పెక్టర్ బాలగోపాల్ ఫోన్‌ను లాక్కోని ధ్వంసం చేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. హైడ్రా సిబ్బంది అక్రమంగా తప్పుడు పత్రాలను చూపించి మీకు ఎలాంటి హక్కు లేదు. ఏమైనా మాట్లాడాలనుకుంటే హైడ్రా ఆఫీసుకు వెళ్లండని చెప్పారని,సున్నం చెరువు సియేట్ కాలనీ బాధితులు పైసా పైసా కూడబెట్టి వచ్చిన డబ్బులతో సియేట్ సొసైటీలో ప్లాట్లు కొనుగోలు చేశారని, సియేట్ సొసైటీకి ఆనాడు అన్ని రకాల అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఈనాడు తమకు సంబందం లేనట్లుగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అని ఖండించారు. ప్రభుత్వం బాధితులకు సరైన న్యాయం చేయాలని కోరారు.
1998 -2016 మధ్య సియేట్ ప్లాట్ యాజమానులు ప్రభుత్వంతో అధికారికంగా యూఎల్సీ, ఎల్ఆర్ఎస్, జీహెచ్ఎంసీ, బ్యాంకుల లోన్లు అనుమతుల ఆధారంగా 100 శాతం చట్టబద్ధమైన కొనుగోలుదారులమని రుజువైందని బాధితులు తెలిపారు. తమ ప్లాట్లు అన్ని రకాలుగా ప్రభుత్వంతో అనుమతులు పొందినవని, ప్లాట్లు ఎఫ్టీఎల్కి ఎటువంటి సంబంధం లేవని చెబుతున్నప్పటికి, హైడ్రా అధికారులు మాత్రం ఎఫ్టీఎల్ అంటు కోర్టు తీర్పు వెలువడక ముందే ఇక్కడ పనులు చేయడం సరికాదని వాపోయారు. పైసా పైసా కూడబెట్టిన సొమ్ముతో ప్లాట్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు.
2016లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎఫ్టీఎల్ పరిధికి వస్తుందని మార్కింగ్ చేసి తప్పు చేసిందని, సియేట్ భూములు ఉన్న సర్వే నంబర్ 12,12ఏ,13 గుట్టలబేగంపేట్ ను సున్నం చెరువు ఎఫ్టీఎల్గా చూపించారని, సున్నం చెరువు అనేది సర్వే నంబర్ 30, అల్లాపూర్ విలేజ్, కూకట్పల్లి మండలానికి చెందినదని, సియేట్ మారుతి హిల్స్ కాలనీ మాత్రం శేరిలింగంపల్లి మండలానికి చెందినదని, ఇవి రెండింటికి ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. సియేట్ అంటే స్మాల్ ఇండస్ట్రీ ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ అని, ప్రస్తుతం ఎన్ఐ ఎంఎస్ఎంఈ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైసెస్గా పేరు మారినట్లు తెలిపారు. ఈ భూములు ప్రధానంగా చిన్న పరిశ్రమల ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజల కోసం కేటాయించినట్లు చెప్పారు. ఇందులో ఉన్న ప్లాట్ యజమానులు 70 సంవత్సరాలు పూర్తయిన వారే ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం స్వయంగా ఎన్జీటీకి ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం .. సున్నం చెరువు మొత్తం 15.25 ఎకరాల్లో ఉందని, సియేట్ కాలనీకి సున్నం చెరువుకు ఎటువంటి సంబంధం లేదని ఎన్జీటీ రిపోర్టు ఇచ్చిందని తెలిపారు. సియేట్ మాస్టర్ ప్లాన్ ప్రకారం .. 80 ఫీట్ల రహదారి వదలడంతో పాటు 2 ఎకరాల్లో గ్రీన్ బెల్ట్‌ను ఇచ్చినట్లు తెలిపారు. 2024లో సియేట్ సొసైటీ యూఎల్సీ, ఎల్ఆర్ఎస్, జీహెచ్ఎంసీతో అనుమతులు పొందినప్పటికి హైడ్రా అక్రమంగా కూల్చివేయడంతో సియేట్ హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు స్టేటస్ కో అమలు చేసి సియేట్ భూములను మార్చకూడదని ఆదేశించినప్పటికి హైడ్రా నవంబర్ 12, 2025 న అనధికార ఫెన్సింగ్ చేసే ప్రయత్నం చేసిందని, నవంబర్ 17న 2025 న పోలీసులతో కలిసి తవ్వకాలు, రాత్రి, ఉదయం కార్యకలాపాలు కొనసాగించినట్లు తెలిపారు.
సియేట్ సొసైటీకి చెందిన ప్లాట్లు ఎత్తైన ప్రదేశంలో ఉండటంతో వర్షపు నీరు, వరద వచ్చే అవకాశం లేదని సియేట్ సొసైటీ సభ్యులు తెలిపారు. మొత్తం వరద నీరు సర్వే నంబర్ 30లో ప్రవహించేదే తప్ప సర్వే నంబర్ 12, 12ఏ, 13లోకి చేరలేదన్నారు. హైడ్రా అక్రమ చర్యలను వెంటనే నిలిపివేయాలని, హై కోర్టు స్టేటస్ కో ఆదేశాలను పాటించాలని, నిపుణులతో నిజమైన సర్వే చేయించాలని, 200లకు పైగా కుటుంబాలు ప్రైవేట్ భూ హక్కులను కాపాడాలని, తప్పుడు నివేదికలు అందిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని సున్నం చెరువు బాధితులు తెలిపారు.
మాదాపూర్‌లోని సున్నం చెరువులో ఉన్న హనుమాన్ దేవాలయాన్ని గురువారం హైడ్రా అధికారులు తొలగించే ప్రయత్నం చేయగా.. స్థానికులు, భజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో హైడ్రా అధికారులు వెనుదిరిగారు. విషయం తెలుసుకున్న పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు విచ్చేసి హనుమాన్ దేవాలయాన్ని తొలగిస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. ఏండ్ల తరబడి కొలువుదీరిన హనమాన్ దేవాలయాన్ని తొలగిస్తే ఎట్టి పరిస్థితుల్లో నూ ఊరుకునేది లేదని చెప్పారు.