Sabarimala : కేరళలోని శబరిమలకు వెళ్లిన ఓ భక్తుడి జీవితం విషాదాంతమైంది. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన తెలంగాణలోని శంకర్పల్లికి చెందిన మల్లికార్జున్ రెడ్డి (Mallikharjun Reddy) గురువారం హఠాత్తుగా మరణించాడు. ఆయన మృతికి గుండెపోటు కారణమని స్థానిక వైద్యులు తెలిపారు. దైవ దర్శనం కోసం వెళ్లిన ఆయన అక్కడే ప్రాణాలు కోల్పోవడంతో శంకర్పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గత వారం రోజులకుగా శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో భక్తుల రద్దీ భారీగా ఉంది. స్వామివారి సర్వ దర్శనానికి16 గంటలు పడుతోంది. దాంతో.. భక్తులు భారీగా క్యూ లైన్లలో వేచి ఉంటున్నారు. మల్లికార్జున రెడ్డి సైతం స్వామి సన్నిధానానికి చేరుకునే క్రమంలో అస్వస్థతకు గురయ్యాడు. కిందపడిపోయిన అతడిని తోటి భక్తులు గమనించి స్థానిక వైద్యులకు చూపించారు. కానీ, ఆయన మరణించాడని ప్రాథమిక వైద్య సిబ్బంది తెలిపారు. దాంతో.. ఆయన కుటుంబంలో విషాదం నిండింది.