Cold Wave | హైదరాబాద్ : రాష్ట్రంలో చలి గాలుల తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలను చలిగాలుల తీవ్రత వణికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల లోపు నమోదవుతున్నాయి. 10 జిల్లాల్లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి. రాష్ట్రంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.4 డిగ్రీలు, కొమురంభీం-ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ -యూలో 8 డిగ్రీల చొప్పున నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈనెల 22వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని, అనంతరం 48 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశలో కదిలి మరింత బలపడి ఈనెల 24 నాటికి వాయుగుండంగా మరే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తర్వాత 24 గంటలలో ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశలో కదిలి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది.
దీని ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు తక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 48 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉదయం వేళల్లో పొగమంచు, మబ్బులతో కూడిన పరిస్థితులు ఉండే అవకాశం ఉందన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఈశాన్య దిశల నుంచి ఉపరితల గాలులు గంటకు 4-6 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 29.4 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 13.1 డిగ్రీలు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.