Biological E Limited : ఫార్మాసూటిల్ కంపెనీ బయలాజికల్ ఈ లిమిటెడ్ (Biological E Limited) కంపెనీ మరో ముందడుగు వేసింది. ఆ కంపెనీ ఇటీవల తయారు చేసిన 14 వలెంట్ న్యూమోకోకల్ కన్జువేట్ వ్యాక్సిన్ (PNEUBEVAX 14® (BE-PCV-14))కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్ఓ ముందస్తు అర్హత (ప్రీ-క్వాలిఫికేషన్) స్టేటస్ ఇచ్చింది. ఈ విషయాన్ని గురువారం బయలాజికల్ ఈ లిమిటెడ్ కంపెనీ వెల్లడించింది.
హైదరాబాద్‌లోని ప్రముఖ వ్యాక్సిన్, ఫార్మాసూటికల్ కంపెనీ అయిన బయలాజికల్ ఈ లిమిటెడ్ రూపొందించిన 14 వలెంట్ న్యూమోకోకల్ కన్జువేట్ వ్యాక్సిన్ (PNEUBEVAX 14® (BE-PCV-14))కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి లభించింది. డబ్ల్యూహెచ్‌వో నుంచి ముందస్తు అర్హత పొందిన 11వ బయలాజికల్ ఈ లిమిటెడ్ వ్యాక్సిన్ ఇది. ఈ వ్యాక్సిన్ 14 రకాల స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా బ్యాక్టీరియా నుంచి రక్షణనిస్తుంది. ఇతర న్యూమోకోకల్ కన్జుగేట్ వ్యాక్సిన్లు రక్షణ ఇవ్వలేని 22ఎఫ్, 33ఎఫ్ వంటి ప్రమాదకరమైన రకాల నుంచి ఈ వ్యాక్సిన్ కాపాడుతుంది. ఆరువారాల వయసున్న శిశువుల్లో న్యూమోనియా, మెనింజైటిస్‌తో పాటు సెప్సిస్ వంటి వ్యాధులను PNEUBEVAX 14 నయం చేయగలదు. ఈ వ్యాక్సిన్ 14 రకాల స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా రకాలను అడ్డుకునేందుకు రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుందని ప్రయోగ అధ్యయనాలు చెబుతున్నాయి.
డబ్ల్యూహెచ్‌వో నుంచి PNEUBEVAX 14కు ముందస్తు అర్హత గుర్తింపు లభించడం పట్ల బయలాజికల్ ఈ లిమిటెడ్ ఎండీ మహిమా దత్లా (Mahima Datla) సంతోషం వ్యక్తం చేశారు. ‘మా సంస్థ తయారు చేసినPNEUBEVAX 14 వ్యాక్సీన్‌కు డబ్ల్యూహెచ్‌వో ముందస్తు అర్హత గుర్తింపు లభించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఘనత సాధించడం ద్వారా ప్రపంచంలో న్యూమోనియాను నివారించగల సమర్ధవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. ముందస్తు అర్హత గుర్తింపు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్‌ను వినియోగించే అవకాశం వచ్చింది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం ప్రజారోగ్యానికి పాటుపడేందుకు క్కువ ధరకే నాణ్యమైన వ్యాక్సిన్ తయారీకి మా సంస్థ కట్టుబడి ఉంది’ అని మహిమా డత్లా పేర్కొన్నారు.