Riyan Williams : యువ ఫుట్‌బాలర్ రియాన్ విలియమ్స్ (Riyan Williams) కల నెరవేరనుంది. దేశానికి ఆడేందుకు ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న అతడికి భారత ఫుట్‌బాల్ సమాఖ్య(AIFF) గుడ్‌న్యూస్ చెప్పింది. బ్లూ టైగర్స్ జెర్సీ వేసుకునేందుకు ఆస్ట్రేలియా పౌరసత్వాన్ని వదులకున్న అతడికి భారత పౌరుడిగా గుర్తింపు లభించింది. దాంతో.. ఏఐఎఫ్ఎఫ్ సైతం విలియమ్స్‌కు గురువారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బెంగళూరు ఎఫ్‌సీ ఫార్వర్డ్ ప్లేయర్ అయిన విలియమ్స్ భారత జట్టు సెలక్షన్స్‌కు అందుబాటులో ఉండనున్నాడు.
భారత ఫుట్‌బాల్ సమాఖ్య ప్రకారం.. రియాన్ విలియమ్స్ జాతీయ జట్టు ఎంపికకు అర్హత సాధించాడు. భారత పౌరుడు అయినందుకు అతడిని ఇకపై బ్లూ టైగర్స్ స్క్వాడ్‌కు పరిగణనలోకి తీసుకోవచ్చు. ఆటగాళ్లకు క్లియరన్స్ ఇచ్చేందుకు నవంబర్ 19 తుది గడువు. రియాన్ దరఖాస్తును పరిశీలించిన ఏఐఎఫ్ఎఫ్ అతడు సెలక్షన్స్‌కు అర్హుడని ఆమోద ముద్ర వేసింది.
FIFA’s Players’ Status Chamber approves Ryan Williams’ eligibility to represent India
The Chamber issued its final decision on November 19, 2025, approving the change of association request for Ryan Williams, thereby making him formally eligible to represent the Indian national… pic.twitter.com/fZwjYfxQWu
— Indian Football (@IndianFootball) November 20, 2025
ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో పుట్టిన విలియమ్స్ తల్లిది ముంబై కాగా.. నాన్న ఇంగ్లండ్‌లోని కెంట్ ప్రాంతవాసి. ఆసీస్ గడ్డపైనే పుట్టి పెరిగిన విలియమ్స్ ఆ దేశ అండర్-20, అండర్ -23 జట్లకు ఆడాడు. ఒక ఫ్రెండ్లీ మ్యాచ్‌లో సీనియర్ జట్టు తరఫున రెండో అర్ధభాగంలో మైదానంలోకి దిగాడు. 2023లో భారత్‌కు వచ్చేసిన విలియమ్స్ బెంగళూరు ఎఫ్‌సీలో చేరాడు. ఒకవేళ స్క్వాడ్‌లోకి ఎంపికైతే విదేశాల్లో పుట్టి బ్లూ టైగర్స్‌కు ఆడిన రెండో ఆటగాడిగా అతడు రికార్డు సృష్టిస్తాడు. విలియమ్స్ కంటే ముందు ఇజుమ్ అరాట(జపాన్‌లో పుట్టి పెరిగాడు) 2013-14మధ్య దేశానికి ఆడాడు.