సిటీబ్యూరో, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ): మంచిరేవుల వద్ద మూసీ నది పరివాహక ప్రాంతంలో పోసిన మట్టిని వెంటనే తొలగించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలు నిర్మాణ సంస్థలను ఆదేశించారు. నది పరివాహకంలో ఎలా మట్టి పోస్తారంటూ ఆదిత్య, ఎన్సీసీ, రాజపుష్ప నిర్మాణ సంస్థలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మంచిరేవుల వద్ద మూసీ పరివాహక ప్రాంతాన్ని రంగనాథ్ పరిశీలించారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండల పరిధిలోని మణికొండ మున్సిపాలిటీ అల్కాపురి టౌన్షిప్లో అనుహర్ హోమ్స్ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన మార్నింగ్ రాగా గేటెడ్ కమ్యూనిటీని రంగనాథ్ సందర్శించారు. రాగా గేటెడ్ కమ్యూనిటీలో రెసిడెన్షియల్ అనుమతులు తీసుకొని కమర్షియల్‌గా వినియోగించడంపై స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక మున్సిపల్ కమిషనర్‌తోపాటు నివాసితులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను విచారించారు. రెసిడెన్షియల్ అనుమతులు తీసుకున్న ప్రకారమే నిర్మాణాన్ని ఉంచాలని, ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.
అక్రమ నిర్మాణాలు, వినియోగంపై తెలంగాణ మన్సిపల్ యాక్ట్ సెక్షన్ 178(2) ప్రకారం హైడ్రాకు సమకూరిన అధికారాల మేరకు హైడ్రా తనిఖీలు చేపట్టిందని కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా రాగా కమ్యూనిటీలో గ్రౌండ్‌ఫ్లోర్‌ను కమర్షియల్‌గా మార్చిన పక్షంలో నిర్మాణ సామర్థ్యం సరిపోదని ఆయన సూచించారు. అనుమతుల మేరకే భవనం వినియోగం ఉండాలని, అనూహర్ హోమ్స్ అనుమతుల పత్రాలు పరిశీలించి చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీరం చెరువును వివిధ శాఖల అధికారులతో కలిసి రంగనాథ్ పరిశీలించారు. చెరువు అలుగు వెళ్లే మార్గంలో డ్రైన్ బాక్స్‌ను నిర్మాణం చేయాలని నిర్మాణ సంస్థకు ఆదేశాలిచ్చారు.
బండ్లగూడ, డిసెంబర్ 7: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. శనివారం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి కార్పొరేషన్ పరిధిలోని పీరం చెరువును పరిశీలించారు. ఇటీవల కాలంలో పీరం చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అనేక నిర్మాణాలు వెలుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పీరం చెరువును సందర్శించడంతో ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. చెరువు చుట్టూ వెలిసిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తారా? లేక అనుమతులు ఉన్నాయని వదిలేస్తారా? అని ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పీరం చెరువు అలుగు వెళ్లే ప్రాంతంలో శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్కు వారు నిర్మాణం చేపడుతున్నారు. కాగా, వారు ప్లానింగ్‌లో పేర్కొన్న మేరకు డ్రైన్ బాక్స్‌ను నిర్మించలేదు. కాగా, పీరం చెరువు అలుగును డ్రైన్బాక్స్ నిర్మాణాన్ని 15 రోజుల్లో చేపట్టాలని, లేదంటే అనుమతులు రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.