పీర్జాదిగూడ/ఘట్కేసర్, మార్చి 28 : రాష్ర్టాన్ని అభివృద్ధి పరిచే ఆలోచన బీజేపీకి లేదని, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే తప్పా.. రాష్ర్టానికి ఏం చేశారో.. ఏం చేస్తారో.. చెప్పడం లేదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ పేరు వింటేనే ప్రధాని మోదీకి వణుకు పుడుతుందని తెలిపారు. మంగళవారం పీర్జాదిగూడ బండిగార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీర్జాదిగూడ, బోడుప్పల్ మేయర్లు జక్క వెంకట్‌రెడ్డి, సామల బుచ్చిరెడ్డిలతో కలిసి జంట మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఏర్పరుచుకున్న 509 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అదేవిధంగా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో ఘట్కేసర్, పోచారం, రూరల్ గ్రామాల పేద ప్రజలకు ప్రభుత్వ జీఓ 58 కింద 158 ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల పక్షపతి అని అన్నారు. ఇతర రాష్ర్టాల్లో సీఎం కేసీఆర్‌కు ప్రజలు నీరాజనాలు పడుతుంటే.. బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని., అందుకే ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. అబద్దాలు చెబుతున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలను సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూపుతూ నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
59జీవోతో స్థలాల క్రమబద్ధీకరణ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి వివరించారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు గూడు కల్పించేందుకు స్థలాలు ఉన్నవారి గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలు ఇస్తుందని, అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, ఆర్టీఓ రవి, ఘట్కేసర్ చైర్పర్సన్ ముల్లి పావనీ జంగయ్య యాదవ్, పోచారం చైర్మన్ బి.కొండల్‌రెడ్డి, కౌన్సిలర్లు, తాశీల్దార్ విజయలక్ష్మి, డిప్యూటీ తాశీల్దార్ భాస్కర్‌రెడ్డి, ఆర్ఐ అలేఖ్య, బీఆర్ఎస్ అధ్యక్షులు సురేందర్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.