సిటీబ్యూరో, అక్టోబరు 31 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు ఖరారైందని, కానీ మెజార్టీ ఎంతో తేలాల్సి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలంటే..జైత్రయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభం కావాలని కేటీఆర్ అన్నారు. నాలుగు లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లకు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల గోస తీర్చే అవకాశం వచ్చిందని కేటీఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం షేక్‌పేట డివిజన్లో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌కు మద్దతుగా ప్రసంగించారు.
మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెబుదామని కేటీఆర్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌లో గట్టి తీర్పు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంతు చేస్తే కచ్చితంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సిన పథకాలన్నీ బ్రహ్మాండంగా ప్రజలకు అందుతాయని తెలిపారు. కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు కావాలని, పింఛన్, తులం బంగారం, సూటీలు, రూ. 2500 రావాలంటే కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని ,కాంగ్రెస్ చేసిన మోసాన్ని మోసంతోనే జయించాలని ఓటర్లకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
సిటీబ్యూరో, అక్టోబరు 31 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సమరంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం రహ్మత్‌నగర్ డివిజన్లో పర్యటిస్తారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌తో కలిసి రోడ్ షో నిర్వహించనున్నారు. తొలుత ప్రతిభా నగర్, ఇందిరా గాంధీ విగ్రహం నుంచి కేటీఆర్ రోడ్ షో ప్రారంభం కానుంది. ఆ తర్వాత శ్రీరాం నగర్, కార్మిక నగర్ చౌరస్తా, రహ్మత్‌నగర్ పీజేఆర్ విగ్రహం వరకు ఈ రోడ్ షో జరగనుంది. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించనున్నారు.

కేటీఆర్ నిర్వహించిన రోడ్ షోకు షేక్‌పేట ప్రజలు బ్రహ్మరథం పట్టారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచే వీధులు, కాలనీలన్నీ గులాబీమయమయ్యాయి. డివిజన్ నలువైపులా నుంచి భారీగా గులాబీ శ్రేణులు షేక్‌పేట నాలా శివాజీ విగ్రహం వద్దకు భారీగా తరలివచ్చారు. తెలంగాణ పాటలతో మద్దెల సందీప్, మానుకోట ప్రసాద్‌ల ధూంధాం కార్యక్రమం శ్రేణులను ఉర్రూతలూగించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీలపై అమలుపై జనం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దోకేబాజ్ కాంగ్రెస్‌కు గట్టి గుణపాఠం చెబుతామని ప్రజలు ముక్తకంఠంతో చెప్పడం గమనార్హం. అంతకు ముందు కేటీఆర్ నందినగర్ నివాసం నుంచి బయలు దేరగా పార్టీ మహిళా నేతలు, ప్రజాప్రతినిధులు మంగళహారతులు పట్టి, నుదుటన కుంకుమ తిలకం దిద్ది శాలువాలు, పూలమాలలతో ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుతున్నారు
రోడ్ షో సందర్భంగా వచ్చిన జన స్పందన చూసి గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. పోలింగ్ ముగిసే వరకు మరింత కష్టపడి పనిచేయాలనే పట్టుదల వారిలో కనిపించింది. కాలనీ, బస్తీ, బస్తీల్లో కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల వంచనను వివరించాలన్న ఉత్సాహం వారిలో నెలకొన్నది. తొలి రోజు రోడ్ షో బంపర్‌హిట్ అయిందని, తమకు, తమ యువనేత కొత్త జవసత్వాలు అందించారని, ఈ స్ఫూర్తితో ఎన్నికలు అయిపోయేంతవరకు అవిశ్రాంతంగా పనిచేస్తామని కార్యకర్తలు, నాయకులు రెట్టించిన ఉత్సాహంతో ప్రకటిస్తుండడం విశేషం. కాంగ్రెస్ వాళ్లు ఇచ్చే 5 వేల రూపాయలు తీసుకుని, మిగతా బాకీ డబ్బులు ఎప్పుడు ఇస్తావ్ బిడ్డా అని అడుగాలని కేటీఆర్ ఓటర్లకు చెబుతుంటే అందరూ తమ కేకలతో హర్షం వ్యక్తం చేశారు. కేటీఆర్ ప్రసంగం అనంతరం పెట్టిన కేసీఆర్ పక్కా పాటకు యువత చౌరస్తాలో చేసిన నృత్యాలు అందరినీ అబ్బుర పరిచాయి.