Year Ender 2024 | గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ప్రతి ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పురుషులతో పాటు మహిళల్లోనూ గుండె జబ్బులు, కార్డియో వాస్కులర్ (cvd) ప్రధాన కారణమని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. 2024 సంవత్సరంలో గుండె సమస్యలు వైద్యరంగానికి సవాల్‌ను విసిరాయి. గుండెపోటు, కార్డియాకరెస్ట్ కారణంగా చాలామంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం సంవత్సరం ముగింపునకు చేరుకున్నాం. 2024 సంవత్సరంలో గుండె సమస్యలను పరిశీలిస్తే.. కరోనా మహమ్మారి తర్వాత భారత్‌తో సహా ప్రపంచ దేశాల్లో గుండె జబ్బులు ఎక్కువగా నమోదవుతున్నట్లుగా పలు నివేదికలు పేర్కొంటున్నాయి. త్వరలోనే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో.. పలు ప్రయత్నాలతో 2025లో గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అందరూ గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండాలన్నారు.
2024లో తీవ్రమైన గుండె సమస్యల కారణంగా లక్షల్లో జనం ప్రాణాలు కోల్పోయారు. ఇందులో పలువురు ప్రముఖులు సైతం ఉన్నారు. ప్రముఖ టెలివిజన్ నటుడు రితురాజ్ సింగ్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. అలాగే, నటి కవితా చౌదరి సైతం గుండెపోటుతోనే తుదిశ్వాస విడిచారు. అలాగే, టీవీ నటుడు, మోడల్ వికాస్ సేథి సహా పలువురు గుండె సంబంధిత సమస్యలతోనే కన్నుమూశారు. దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా గుండెపోటు, కార్డియాకరెస్ట్ మరియు గుండె ఆగిపోవడం వల్ల మరణాలు వార్తల్లో నిలిచాయి. వచ్చే 2025లో ఈ ప్రమాదాన్ని తగ్గించేందుకు ముందస్తుగా ప్రయత్నాలు చేయడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
హార్ట్ ఎటాక్‌తో పాటు కార్డియాకరెస్ట్ కేసులు ఈ సంవత్సరం ఆందోళనను రేకెత్తించాయి. ముంబయి క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలే టీ20 ప్రపంచకప్ క్రికెట్లో ఆదివారం (జూన్ 9) భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చూసేందుకు వచ్చారు. ఆ తర్వాత మరుసటి రోజున సోమవారం న్యూయార్క్‌లో ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సందడిగా గడిపిన ఆయన.. అంతలోనే హఠాన్మరణం చెందారు. గుండెపోటు, కార్డియాకరెస్ట్ రెండు వేర్వేరు పరిస్థితులనే విషయాన్ని అర్థం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గుండెకు రక్తాన్ని తీసుకువెళ్లే ధమనుల్లో పలు అడ్డంకుల కారణంగా గుండెకు రక్తప్రసరణ తగ్గుతుంది. దాంతో గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. కార్డియాకరెస్ట్ విషయంలో గుండె ఆకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోతుంది.
కరోనా ఇన్ఫెక్షన్, మరణాల ప్రమాదాన్ని తగ్గించడంలో వ్యాక్సినేషన్ ప్రధాన పాత్ర పోషించింది. టీకా కారణంగా గుండెపోటు, మరణాల కేసులు పెరిగాయని నివేదిక పేర్కొంటున్నాయి. అయితే, ఈ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని.. ఎలాంటి సమస్యలు తలెత్తవని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) హామీ ఇచ్చింది. కోవిడ్-19 వ్యాక్సినేషన్ పూర్తిగా సురక్షితమైందని.. మరణాల రేటు పెరిగేందుకు వ్యాక్సినేషన్ కారణం కాదని ఐసీఎంఆర్ ఓ అధ్యయనం ఆధారంగా పేర్కొంది.
భవిష్యత్‌లో గుండె జబ్బులు పెరిగే ప్రమాదం ఉంటుందని.. అందుకే ముందస్తుగా నివారణ చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, గుండెపోటు వస్తే ప్రాణాలను ఎలా కాపాడుకోవాలన్న విషయంపై సైతం అవగాహన ఉండాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు వచ్చిన సమయంలో రోగికి వెంటనే సీపీఆర్ అందించడం ద్వారా అత్యవసర వైద్యం అందిస్తే.. అ సమయంలో జీవితాన్ని రక్షించవచ్చని చెబుతున్నారు. గుండెజబ్బుల ప్రమాదాన్ని నివారించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని, మెరుగైన ఆహారం, రక్తపోటు, షుగర్ టెస్టులు చేసుకోవాలని సూచిస్తున్నారు.