World Cancer Day | అత్యాధునిక వైద్య పరిజ్ఞానంతో మనిషి తన జీవిత కాలాన్ని పెంచుకోగలుగుతున్నాడు. అయితే, క్యాన్సర్‌కు మాత్రం సరైన సమాధానం తెలుసుకోలేకపోతున్నాడు. ఎన్ని మందులు వచ్చినా, మరెన్ని కొత్త చికిత్సలు అందుబాటులో ఉన్నా క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కొరవడిందని చెప్పవచ్చు. అందుకే క్యాన్సర్ పేరు వినగానే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కానీ, తొలిదశలోనే గుర్తిస్తే క్యాన్సర్ వ్యాధులను జయించవచ్చు. ఇదిలా ఉంటే ఒకప్పుడు కారణం లేకుండా వచ్చే కొన్ని రకాల క్యాన్సర్లు ఇప్పుడు మన తప్పిదాల వల్లేవస్తున్నాయి. దీనికితోడు వ్యాధికి సకాలంలో తగిన చికిత్స తీసుకోకపోవడంతో ఎంతోమంది ఈ వ్యాధికి బలైపోతున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని క్యాన్సర్ వ్యాధులు, చికిత్స తదితర అంశాలపై అవగాహన కల్పించాలనే సంకల్పంతోప్రతి ఏటా ఫిబ్రవరి 4ను ప్రపంచ క్యాన్సర్ దినంగా పాటిస్తున్నారు.
క్యాన్సర్వ్యాధుల్లో చాలా రకాలు ఉన్నాయి. శరీరంలో ఏ అవయవానికి అయినా ఈ వ్యాధి సోకవచ్చు. మనిషి శరీరంలో నిరంతరం కణాల విభజన జరుగుతూ ఉంటుంది. అయితే, ఈ విభజన సమతుల్యంగా సాగిపోతూ ఉండాలి. పైగా వయసు పెరిగే కొద్దీ పాత కణాలు నశిస్తూ, కొత్త కణాలు పుట్టుకొస్తూ ఉంటాయి. అలా కాకుండా కణాల విభజన అసంబద్ధంగా జరగడం వల్ల కొన్ని కణాలు పెరుగుతూ పోతాయి. ఇవి నశించకుండా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. ఈ విధంగా జరిగే కణ విభజన వల్ల ఏర్పడే కణుతులనే క్యాన్సర్‌గా పేర్కొంటారు. క్యాన్సర్ వ్యాధులకు వయసుతో సంబంధం ఉండదు. ఏ వయసు వారికైనా రావచ్చు. కాగా, చాలా క్యాన్సర్ వ్యాధుల వచ్చేందుకు కచ్చితమైన కారణాలు చెప్పలేం. వీటిలో కొన్ని రకాల క్యాన్సర్లు జన్యుపరంగా వస్తే, మరికొన్ని అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం తదితర కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది.
కొన్నేళ్ల కింది వరకు 45 ఏళ్లు దాటినవారే ఎక్కువగా క్యాన్సర్ల బారినపడేవారు. కానీ, కొంతకాలంగా 35 ఏళ్ల వయసు వారిలోనూ కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 25లక్షల మంది క్యాన్సర్ రోగులు ఉండగా, తెలంగాణలో లక్ష మంది దాకా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అలానే క్యాన్సర్ బారినపడే వయసు కూడా 45 నుంచి 35కు తగ్గడం బాధాకరం. గతంలో 35 ఏళ్ల వయసు వారిలో కేవలం 1 నుంచి 2 శాతం మధ్య క్యాన్సర్ రోగులు ఉండేవాళ్లు. ప్రస్తుతం ఆ సంఖ్య 20 శాతం వరకు పెరిగింది.
మామూలుగా అయితే క్యాన్సర్ చికిత్సల వల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ఈ సైడ్ ఎఫెక్ట్స్‌ను కూడా తగ్గించే పద్ధతులు, ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ రోగులు అన్నిరకాల సౌకర్యాలు ఉండి, అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్న దవాఖానలో చేరాలి. క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవడంతోపాటు యోగా, ధ్యానం వంటివి చేయాలి. ఇవి రోగికి చికిత్సకు అదనపు ప్రయోజనాన్ని ఇస్తాయి. సమతుల పౌష్టికాహారం తినాలి. డాక్టర్ల సూచన మేరకు రోజూ వ్యాయామం చేయడం తప్పనిసరి.క్యాన్సర్ వ్యాధులకు సంబంధించి ప్రస్తుతం అత్యాధునిక చికిత్స విధానాలను అభివృద్ధిచేశారు. కీ- హోల్ సర్జరీలు, హార్మోన్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ, కీమో థెరపీ, రేడియో థెరపీ మొదలైన చికిత్సలు ఇప్పుడు ప్రధానంగా అందుబాటులో ఉన్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం గడిచిన ఐదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసుల సంఖ్య అంతకుముందుతో పోలిస్తే దాదాపు 20 శాతం వరకు పెరిగింది. ఈ సంఖ్య 2030 నాటికి 50 శాతానికి పెరగొచ్చన్నది ఆందోళన కలిగించే విషయం. వైద్యశాస్త్ర పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా ప్రజల్లో అవగాహన లేకపోతే పరిస్థితి తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. వివిధ రకాల క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ మొదటి స్థానంలో, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రెండో స్థానంలో, నోటి క్యాన్సర్ మూడో స్థానంలో, ఊపిరితిత్తులు, పొట్టకు సంబంధించి క్యాన్సర్లు నాలుగో స్థానంలో ఉండగా, పెద్దపేగు క్యాన్సర్ ఐదో స్థానంలో ఉన్నది. ఇక నోటి క్యాన్సర్ (ఓరల్ క్యాన్సర్) రోగులు తెలంగాణలో రెండో స్థానంలో ఉన్నారు.
ఒక వ్యక్తి శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ కణం ఉందా అని మొత్తంగా తెలుసుకునే పరీక్షలు ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ ఏదైనా ఒక అవయవానికి వ్యాధి సోకినట్టు అనుమానం ఉంటే మాత్రం, దానికి సంబంధించిన వైద్య పరీక్షల ద్వారా క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. వ్యాధి వచ్చిన ప్రదేశం ఆధారంగా వేర్వేరు నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి బయాప్సి, ఎఫ్ఎన్ఏ టెస్ట్, బ్లడ్ మార్కర్స్, ఎక్స్-రే, సీటీ-స్కాన్, ఎంఆర్ఐ, పెట్ స్కాన్ వంటి పరీక్షల ద్వారా వ్యాధితోపాటు దాని తీవ్రతను కూడా కనిపెట్టేయొచ్చు. అయితే, మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్‌ను మాత్రం పాప్‌స్మియర్ పరీక్ష ద్వారా ముందుగానే గుర్తించడానికి వీలుంది.
వ్యాధికి గల కచ్చితమైన కారణం తెలిస్తే అది రాకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా టీకాల వంటివి తీసుకోవచ్చు. కాని చాలా రకాల క్యాన్సర్లకు కారణమేంటన్నది తెలియదు. అందుకే వీటికి టీకాలు లేవు. కానీ, కొన్ని రకాల క్యాన్సర్లకు మాత్రం టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్. హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) వల్ల ఈ క్యాన్సర్ వస్తుందని నిర్ధారణ జరిగింది. దీంతో ఈ వైరస్ సోకకుండా ముందస్తుగా టీకా వేసుకోవచ్చు. 9 ఏళ్ల బాలికల నుంచి శృంగార జీవితం ప్రారంభం కాని మహిళల వరకు ఈ టీకా వేయవచ్చు. హెచ్‌పీవీ టీకాతో అండాశయం, గొంతు క్యాన్సర్లకు కూడా అడ్డుకట్ట వేయవచ్చు.
వ్యాధి సోకిన అవయవం ఆధారంగా క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి. సాధారణంగా వీటి లక్షణాలు అంత త్వరగా బయటపడవు. వ్యాధి రెండు మూడు దశల్లోకి చేరుకున్న తర్వాత మాత్రమే.. అంటే దాదాపు రోగం ముదిరిన తర్వాతనే లక్షణాలు బయటపడతాయి. అలసట, జ్వరం, వాంతులు, రోగ నిరోధక శక్తి తగ్గటం, ఆకలి మందగించడం, విరేచనాలు, రక్తహీనత మొదలైనవి క్యాన్సర్ వ్యాధుల సాధారణ లక్షణాలు.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మినహా ఇతర క్యాన్సర్లకు కచ్చితమైన కారణాలు తెలియదు. అందువల్ల వ్యాధుల నివారణ మన చేతుల్లో లేదనే చెప్పాలి. అయితే, క్యాన్సర్ వ్యాధులు దరిచేరకుండా కొంతవరకు జాగ్రత్తలు మాత్రం తీసుకోవచ్చు. ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకోవాలి. పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజూ కనీసం అరగంట వ్యాయామం చేయాలి. కాలుష్యానికి దూరంగా ఉండాలి. మద్యపానం, ధూమపానం అలవాట్లు మానుకోవాలి. జీవనశైలిలో మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటిస్తే క్యాన్సర్ ముప్పు తప్పించుకోవచ్చు. అన్నిటినీ మించి క్యాన్సర్‌ను జయించడానికి అవగాహనను మించిన అస్త్రం లేదు. సకాలంలో స్పందించగలిగితే.. క్యాన్సర్ మనల్ని కబళించకముందే వ్యాధిని గుర్తించి, సరైన చికిత్స తీసుకోవచ్చు.
– మహేశ్వర్‌రావు బండారి
డాక్టర్ శ్రీనివాస్ డైరెక్టర్ ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్, హైదరాబాద్