ఏ ఇంట్లో అయినా ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం కూడా బాగుంటుంది. ఉద్యోగం చేసి సంపాదించే మహిళలు అయినా, ఇంటి పట్టున ఉంటూ కుటుంబ యోగక్షేమాలు చూసుకునే గృహిణులకు అయినా ఇదే సూత్రం వర్తిస్తుంది. అయితే, ఒక వయసు వచ్చేసరికి అందరిలోనూ అనారోగ్య సమస్యలు తలెత్తడం సహజం. హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపం, ఒత్తిడి తదితర సమస్యలు వారిని అనారోగ్యానికి చేరువ చేస్తుంటాయి. అయితే, శారీరకంగా బలంగా ఉన్నప్పుడే మానసికంగా దృఢంగా ఉండగలం. నడి వయసుకు వచ్చాక మహిళలు అనారోగ్యంతో సావాసం చేయొద్దంటే ఈ ఐదు విటమిన్లు రోజువారీగా అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.
దీని లోపం వల్ల ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, ఇన్సులిన్ తగ్గడం, రుతుచక్రంలో మార్పులు, సమస్యలు వస్తాయి. ఉదయాన్నే సూర్యరశ్మి శరీరానికి తాకితే విటమిన్ డి3 పుష్కలంగా లభిస్తుంది. అంతేకాదు, సాల్మన్ చేపలు, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులకు రెగ్యులర్ డైట్లో చోటివ్వడం వల్ల కూడా విటమిన్ డి3 శరీరానికి అందుతుంది.
విటమిన్ సి లోపంతో బాధపడేవారికి ప్రొజెస్టిరాన్ ఉత్పత్తి సరిగ్గా ఉండదు. సంతానోత్పత్తి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. నిమ్మకాయ, నారింజ, ఆరెంజ్ వంటి పుల్లటి పండ్ల నుంచి విటమిన్ సి లభిస్తుందని అందరికీ తెలిసిందే. వాటితోపాటు బ్రకోలి, టమాట, క్యాప్సికమ్ నుంచి కూడా శరీరానికి విటమిన్ సి అందుతుంది. జామకాయలు తరచూ తినడం మంచిది. ఇది చర్మ సంరక్షణకూ సహకరిస్తుంది.
ప్రస్తుతం ఎక్కువమంది విటమిన్ బి12 లోపాన్ని ఎదుర్కొంటున్నారు. ఇది లోపిస్తే.. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి మందగిస్తుంది. థైరాయిడ్ సమస్యలు వస్తాయి. మాంసం, చేపలు, గుడ్లు ఎక్కువగా తీసుకుంటే విటమిన్ బి12 లోపం నుంచి బయటపడవచ్చు.
విటమిన్ బి9 లోపంతో గర్భధారణ, సంతానోత్పత్తిలో సమస్యలు ఎదురవుతాయి. ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకుంటే విటమిన్ బి9 పుష్కలంగా అందుతుంది.
విటమిన్ బి6 లోపం ఉన్న మహిళల్లో ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్, ప్రీ మెన్స్ట్రువల్ డైస్ఫోరిక్ డిజార్డర్, అడ్రినల్ గ్రంథి సమస్యలు కనిపిస్తాయి. ఈ విటమిన్ లోపం కారణంగా నిద్రలేమి సమస్య వస్తుంది. మెదడు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అరటిపండ్లు, ఆలుగడ్డలు, చికెన్ తినడం వల్ల విటమిన్ బి6 లభిస్తుంది.