మా బాబు వయసు ఏడు సంవత్సరాలు. రెండేళ్లుగా తరచుగా ముక్కు నుంచి రక్తం కారుతున్నది. రోజూ బాగానే ఉంటాడు. అనారోగ్య సమస్యలేవీ లేవు. అయినా హఠాత్తుగా రక్తం కారుతుంది. ముక్కును వేళ్లతో అదిమిపట్టి ఉంచితే కాసేపటికి రక్తం కారడం ఆగిపోతున్నది. పిల్లల డాక్టర్లకు చూపించాం. కొన్ని రక్త పరీక్షలు చేయించాం. అన్నీ బాగున్నాయని, కంగారు పడొద్దని డాక్టర్లు చెప్పారు. పదే పదే రక్తస్రావం సమస్యకు కారణం ఏమై ఉండొచ్చు. తగ్గుతుందా?
ప్రధానంగా మూడు నుంచి పది సంవత్సరాల వయసున్న కొంతమంది పిల్లల్లో ముక్కు నుంచి రక్తం కారుతుంది. ముక్కులో అతి సూక్ష్మమైన రక్త నాళాలు ఉంటాయి. ఇవి చాలా సున్నితంగా ఉంటాయి. ముక్కులో ఉండే మ్యూకస్ అనే పొర ఎండిపోయినప్పుడు పగుళ్లు ఏర్పడతాయి. ఆ పగుళ్లను వేళ్లతో గిల్లినప్పుడు అక్కడ ఉండే రక్తనాళాలు గాయపడతాయి. అందువల్ల రక్తస్రావం అవుతుంది. ఒక్కోసారి ముక్కును బాగా చీదినా ఇలా రక్తం పడుతుంది. రక్తపరీక్షలు చేయించారు కాబట్టి కంగారు పడకండి. ముక్కు నుంచి రక్తం కారుతున్నప్పుడు రెండు వేళ్లతో ముక్కుని ఒత్తిపట్టండి. అప్పుడు నోటితో శ్వాస తీసుకోవాలి.
ఇలా చేయడంతోపాటు చన్నీటితో ముక్కును కడిగితే రక్తనాళాలు కొంచెం కుంచించుకుపోతాయి. రక్తస్రావం ఆగిపోతుంది. ఈ సమస్య ఉన్నప్పుడు ముక్కులోనే కాకుండా దంతాలు, చిగుళ్లు, ఇతర శరీర భాగాల నుంచి కూడా ఇలా రక్తం కారుతుందేమో పరిశీలించాలి. ముక్కు నుంచి రక్తం ఏకధాటిగా కారినా, కుటుంబసభ్యుల్లో ఎవరికైనా రక్తస్రావ సమస్యలు ఉన్నా ఆ విషయాలు డాక్టర్లకు చెప్పాలి. తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ముక్కులో రక్తస్రావం ప్రమాదకరమైన సమస్య కాదు. ధైర్యంగా ఉండండి.
– డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్