Vitamin D Tablets | సూర్యరశ్మి విటమిన్ అని పిలువబడే విటమిన్ డి మన శరీరానికి ఎంతో అవసరం. ఎముకల ఆరోగ్యానికి, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, మానసిక స్థితిని మెరుగుపరచడంలో విటమిన్ డి ముఖ్య పాత్ర పోషిస్తుంది. మనలో చాలా మందికి విటమిన్ డి ప్రాధాన్యత తెలియడం వల్ల దీనిని క్యాప్సుల్స్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. అయితే విటమిన్ డి ని తీసుకునే సమయాన్ని బట్టి దానిని మన శరీరం గ్రహించే విధానం, పయోగించుకునే విధానం కూడా మారతాయని వైద్యులు చెబుతున్నారు. విటమిన్ డి కొవ్వులో కరిగే విటమిన్. కనుక ఈ లక్షణం దానిని ఎలా, ఎప్పుడు తీసుకుంటున్నామో అనే అంశాలను కూడా ప్రభావితం చేస్తుంది.
కొవ్వు ఉన్న భోజనంతో విటమిన్ డి ని తీసుకోవడం వల్ల దీనిని శరీరం ఎక్కువగా గ్రహిస్తుంది. గుడ్లు, ఆలివ్ నూనె, అవకాడో, గింజలు వంటి మంచి కొవ్వులు ఉన్న ఆహారాలతో విటమిన్ డి ని తీసుకోవడం వల్ల దాన్ని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపుతో విటమిన్ డిని తీసుకోవడం వల్ల శరీరం దానిని తక్కువగా గ్రహిస్తుంది, దాని ప్రయోజనాలు కూడా శరీరానికి పూర్తిగా అందవని వైద్యులు చెబుతున్నారు. అలాగే విటమిన్ డి ని తీసుకునే సమయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రాత్రి సమయంలో కంటే ఉదయం పూట విటమిన్ డిని తీసుకోవడం వల్ల అది మరింత ప్రభావవంతంగా పని చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
నిద్రను నియంత్రించే హార్మోన్ మెలటోనిన్ తో విటమిన్ డి కలిసినప్పుడు శరీరం సిర్కాడియన్ లయలో మార్పులు వస్తాయి. దీంతో నిద్రకు ఆటంకం కలుగుతుంది. కనుక విటమిన్ డి ని ఉదయం పూట లేదా భోజన సమయంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే కాలక్రమేణా మనం తీసుకునే విటమిన్ డి స్థాయిలు కూడా పెరుగుతాయి. కనుక వైద్యులు సూచించిన విధంగా విటమిన్ డి ని తీసుకోవడం మంచిది. మన శరీర వయసు, బరువు, సూర్యరశ్మికి గురికావడం, రక్తంలో విటమిన్ డి స్థాయిలు వంటి అంశాలు మనం తీసుకునే విటమిన్ డి మోతాదును ప్రభావితం చేస్తాయి. అలాగే మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు వైద్యుడిని సంప్రదించిన తరువాతే విటమిన్ డి క్యాప్సుల్స్ ను వాడడం మంచిది.
ఈ విధంగా విటమిన్ డి ని తీసుకునే సమయం దాని ప్రయోజనాలను, శోషణను ప్రభావితం చేస్తాయని విటమిన్ డి ని సరైన సమయంలోనే తీసుకున్నప్పుడే దాని వల్ల కలిగే పూర్తి ప్రయోజనాలను మనం పొందగలుగుతామని వైద్యులు తెలియజేస్తున్నారు.