Menopause | రుతువిరతి అంటే ఏమిటి.. మహిళల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఏం చేయాలి..?
రుతువిరతి అనేది మహిళల్లో సహజంగా జరిగే మార్పు. ఈ దశలో వేడి ఆవిర్లు, రాత్రిపూట చెమటలు పట్టడం, నెలసరి క్రమం తప్పడం వంటి శారీరక సమస్యల గురించి ఎక్కువగా చర్చిస్తుంటారు. అయితే ఉద్యోగాలు చేస్తున్న మహిళలపై రుతువిరతి ప్రభావం ఆరోగ్యానికే పరిమితం కావడం లేదు.
Menopause | రుతువిరతి అనేది మహిళల్లో సహజంగా జరిగే మార్పు. ఈ దశలో వేడి ఆవిర్లు, రాత్రిపూట చెమటలు పట్టడం, నెలసరి క్రమం తప్పడం వంటి శారీరక సమస్యల గురించి ఎక్కువగా చర్చిస్తుంటారు. అయితే ఉద్యోగాలు చేస్తున్న మహిళలపై రుతువిరతి ప్రభావం ఆరోగ్యానికే పరిమితం కావడం లేదు. ఏకాగ్రత తగ్గడం, మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తుకు రాకపోవడం, జ్ఞాపకశక్తి సమస్యలు, ఆందోళన, అలసట వంటి లక్షణాలు వారి ఉద్యోగ సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఉమెన్స్ హెల్త్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన కోసం పరిశోధకులు రెడిట్‌లోని వివిధ చర్చా వేదికల్లో మహిళలు పంచుకున్న 130 అనామక పోస్టులను విశ్లేషించారు. 2022 ఏప్రిల్ నుంచి 2024 జూలై మధ్య నమోదైన ఈ అనుభవాల ఆధారంగా రుతువిరతి, రుతువిరతికి ముందు దశ మహిళల వృత్తి జీవితం, ఉద్యోగ సంబంధాలు, పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో పరిశీలించారు.
లక్షణాలు ఎలా ఉంటాయి..
అధ్యయనంలో ప్రధానంగా గుర్తించిన సమస్యల్లో మెదడులో మబ్బులు కమ్ముకున్నట్లుగా అనిపించే పరిస్థితి ఒకటి. దీన్నే బ్రెయిన్ ఫాగ్ అంటారు. కొందరు మహిళలు మాట్లాడేటప్పుడు పదాలు గుర్తుకు రాకపోవడం, సమావేశాల్లో చెప్పాలనుకున్న విషయాన్ని మర్చిపోవడం, ఏకాగ్రత లోపించడం, జ్ఞాపకశక్తి తగ్గినట్లు అనిపించడం వంటి సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించే మహిళలకు ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. పనులను గతంలోలాగా వేగంగా పూర్తి చేయలేకపోవడం వల్ల తమ సామర్థ్యంపై తమకే సందేహాలు కలుగుతున్నాయి. పనితీరు సమీక్షల్లో తక్కువ మార్కులు వస్తాయేమోనని, సహోద్యోగులు లేదా ఉన్నతాధికారులు తమను అసమర్థులుగా భావిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. కొందరు ఉద్యోగ భద్రత గురించి కూడా భయపడినట్లు అధ్యయనం గుర్తించింది. అయితే సమస్యలను అర్థం చేసుకుని సహకరించే అధికారులు ఉన్నప్పుడు మహిళలు ఈ పరిస్థితిని మెరుగ్గా ఎదుర్కోగలిగారు.
ఉద్యోగ జీవితంపైనా ప్రభావం..
వేడి ఆవిర్లు, రాత్రిపూట చెమటలు పట్టడం వల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది. దీనికి తోడు అలసట, తలనొప్పి, మానసిక స్థితిలో మార్పులు, ఆందోళన వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. నిద్ర సరిగా లేకపోవడం వల్ల మరుసటి రోజు ఏకాగ్రత తగ్గుతుంది. పనితీరుపై ఆందోళన పెరిగితే మానసిక ఒత్తిడి మరింత ఎక్కువవుతుంది. ఇలా ఒక సమస్య మరొక సమస్యకు కారణమవుతూ మహిళల రోజువారీ ఉద్యోగ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే ఈ మార్పులన్నీ ప్రతికూలంగానే ఉండవని అధ్యయనం తెలిపింది. కొందరు మహిళలు రుతువిరతి దశను తమ వృత్తి జీవితాన్ని తిరిగి సమీక్షించుకునే అవకాశంగా భావించారు. ఒత్తిడి తగ్గించుకోవడానికి పని వేళలను మార్చుకోవడం, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేయడం, ఇతర వృత్తులను ఎంచుకోవడం, సొంత వ్యాపారాలు ప్రారంభించడం వంటి ఆలోచనలు చేసినట్లు తెలిపారు. ఆరోగ్యానికి, వ్యక్తిగత సంతృప్తికి ప్రాధాన్యం ఇస్తూ తమ కెరీర్లో కొత్త నిర్ణయాలు తీసుకున్నవారూ ఉన్నారు.
తగ్గుతున్న సామర్థ్యం..
భారత్‌లోనూ ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో రుతువిరతి సమస్యలపై అవగాహన, చర్చలు ఇంకా పరిమితంగానే ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో 45 నుంచి 65 ఏళ్ల వయసున్న 280 మంది ఉద్యోగినులపై 2026లో నిర్వహించిన మరో అధ్యయనంలో 73.2 శాతం మంది మధ్యస్థం నుంచి తీవ్రమైన రుతువిరతి లక్షణాలను ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది. నిద్ర సమస్యలు, అలసట, రోజువారీ పనులు చేయడంలో ఇబ్బందులు వారి ఉద్యోగ సామర్థ్యాన్ని తగ్గించినట్లు గుర్తించారు. ముఖ్యంగా శారీరక శ్రమ ఎక్కువగా ఉండే ఉద్యోగాలు చేసే మహిళల్లో సమస్యల ప్రభావం అధికంగా కనిపించింది. అందువల్ల కార్యాలయాల్లో రుతువిరతిపై అవగాహన కల్పించడం, అవసరమైనప్పుడు పని వేళల్లో వెసులుబాటు ఇవ్వడం, పని ఒత్తిడిని తగ్గించడం, తగిన విశ్రాంతి, వైద్య సదుపాయాలు అందించడం అవసరం. కార్యాలయాల్లో సరైన ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ, తాగునీరు, వ్యక్తిగత అవసరాల కోసం సౌకర్యాలు కల్పించాలి. రుతువిరతి అనేది మహిళల వృత్తి సామర్థ్యం తగ్గిపోయిందని అర్థం కాదు. ఈ దశలో ఎదురయ్యే శారీరక, మానసిక సమస్యలను గుర్తించి తగిన సహకారం అందిస్తే మహిళలు తమ ఉద్యోగాలను, వృత్తిపరమైన లక్ష్యాలను కొనసాగించగలుగుతారని అధ్యయనం సూచిస్తోంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Menopause | రుతువిరతి అంటే ఏమిటి.. మహిళల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఏం చేయాలి..?
Pak’s Toxic Fairness Cream | నిషేధం ఉన్నప్పటికీ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో పాక్ విషపూరిత క్రీమ్ అమ్మకాలు
గురుకుల విద్యార్థులపై వసతి గృహా విద్యార్థుల దాడి
Russia-Ukraine | రష్యా-ఉక్రెయిన్ చర్చల్లో పురోగతి.. యుద్ధ ఖైదీల అప్పగింతపై పరస్పర అంగీకారం..!
రాష్ట్ర స్థాయి వాలీబాల్ జట్టుకు దుగినవెల్లి విద్యార్థి ఎంపిక
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

