జీవితంలో ఉత్పాదకత పెరగడానికి, మానసిక, శారీరక ఆరోగ్యానికి తొందరగా నిద్రలేవడం గొప్ప ఔషధం. అయితే చాలామందికి తెల్లవారినా అలానే నిద్రపోవడం అలవాటుగా ఉంటుంది. ఈ మత్తును వదిలించుకుని ఉదయమే నిద్ర లేవడం, రోజును శక్తిమంతంగా, సానుకూల దృక్పథంతో మొదలుపెట్టడానికి కొన్ని చిన్న మార్పులు చేసుకోవాలి. ఈ ఐదు చిట్కాలు పాటిస్తే పొద్దున్నే లేవడం అనేది ఓ పోరాటం కానేకాదు.
పడుకునే ముందు గడియారం అలారం పెట్టుకుని దగ్గరగా కాకుండా గదిలో ఇంకో మూలన ఉంచాలి. దీంతో కొంత దూరం నడిచి ఆపేస్తాం. ఈ చిన్న పనితో మన మత్తు వదిలిపోతుంది. మరో మాట గడియారం కొంత ఎత్తులో, అలారం కొంచెం పెద్దశబ్దంతో పెట్టుకుంటే దాన్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితి తలెత్తదు.
అలారం ఆపేయగానే మళ్లీ దుప్పటి కప్పుకోవాలనే ఆలోచన రానీయకూడదు. కాబట్టి, మళ్లీ పక్క వైపు చూడకుండా మనసును స్థిరంగా ఉంచుకోవాలి. అలారం ఆపేశాక కిటికీల కర్టెన్లు తీయడం, సూర్యకాంతిని చూడటం లాంటివి చేస్తే శరీరంలో జీవ గడియారానికి పొద్దుపొడిచిందనే విషయం అర్థమైపోతుంది.
చల్లటి నీళ్లు అంటే భయపడిపోతాం. కానీ, చన్నీటి స్నానం మన శరీర రక్త ప్రసరణను పెంచుతుంది. మనసును రిఫ్రెష్ చేస్తుంది. నాడీ వ్యవస్థను చురుగ్గా మారుస్తుంది. ఇది రోజంతా మంచి మూడ్‌తో శక్తిమంతంగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు చల్లనీళ్లతో ముఖం కడుక్కున్నా మంచి ఫలితమే కనిపిస్తుంది.
పడుకోవడానికి ముందు ఎక్కువగా తింటే నిద్రలో ఆటంకం కలుగుతుంది. కాబట్టి, తక్కువ మోతాదులో తినాలి. అలాగే తొందరగా నిద్రపోవాలి. ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర మంచిదని అధ్యయనాలు వెల్లడించాయి.
ఐదారు రోజులు పనిచేసిన తర్వాత వీకెండ్స్‌లో ఎక్కువసేపు నిద్రపోతుంటాం. అయితే, వారాంతాల్లో కూడా మిగిలిన రోజుల నిద్రా చక్రాన్నే అనుసరించాలి. కాబట్టి, కష్టంగా అనిపించినప్పటికీ వారాంతాల్లో ఎక్కువసేపు నిద్రపోయే అలవాటును కూడా మానుకోవాల్సిందే.