AI | కృత్రిమ మేధస్సు (ఏఐ) మన రోజువారీ జీవితంలో వేగంగా భాగమవుతోంది. చిన్న చిన్న సందేహాలకు సమాధానాలు చెప్పడం నుంచి ఈ-మెయిల్ రాయడం, ప్రయాణ ప్రణాళికలు రూపొందించడం, సోషల్ మీడియా క్యాప్షన్లు సూచించడం వరకు అనేక పనులను క్షణాల్లో పూర్తి చేస్తోంది. దీంతో పనులు సులభంగా, వేగంగా పూర్తవుతున్నప్పటికీ, అతిగా ఏఐపై ఆధారపడటం వల్ల స్వతంత్రంగా ఆలోచించే సామర్థ్యం క్రమంగా తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో కాలిక్యులేటర్లు, మ్యాప్లు, జీపీఎస్, సెర్చ్ ఇంజిన్ల వల్ల కొన్ని మానసిక పనులు తగ్గినా, ఏఐ ప్రభావం మరింత విస్తృతంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది కేవలం సమాచారం అందించడమే కాకుండా రాయడం, విశ్లేషించడం, సమస్యలకు పరిష్కారాలు సూచించడం, సృజనాత్మక ఆలోచనల్లో కూడా భాగస్వామ్యం అవుతోంది. దీంతో మనం స్వయంగా ఆలోచించాల్సిన అవసరం తగ్గిపోతోందని పేర్కొంటున్నారు.
ఏఐపై అధికంగా ఆధారపడటం వల్ల మెదడు క్రమంగా గుర్తుంచుకోవడం, తార్కికంగా ఆలోచించడం, సమస్యలను స్వయంగా పరిష్కరించడం వంటి పనులను తగ్గిస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. మెదడు కూడా ఈ పనులను తాను చేయాల్సిన అవసరం లేదని భావించి, ఆ దిశగా శ్రమను తగ్గించే అవకాశం ఉందని అంటున్నారు. దీని వల్ల సమాచారాన్ని గుర్తుంచుకునే సామర్థ్యం, విశ్లేషణాత్మక ఆలోచన, విమర్శనాత్మక దృక్పథం క్రమంగా బలహీనపడతాయి. ఏదైనా ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి లేదా సమస్యను పరిష్కరించడానికి స్వయంగా ప్రయత్నించకుండా నేరుగా ఏఐని ఆశ్రయిస్తే, మెదడుకు అవసరమైన సాధన తగ్గిపోతుంది. ఈ సాధనే జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంతోపాటు ఆలోచనా సామర్థ్యాన్ని పదునుగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడూ వెంటనే సమాధానం దొరకడం వల్ల ఏకాగ్రత కూడా తగ్గే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
అధికంగా ఏఐని ఉపయోగించడం వల్ల సృజనాత్మకత, సమస్యలను స్వయంగా పరిష్కరించే నైపుణ్యం కూడా క్రమంగా బలహీనపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి పనికీ ఏఐపై ఆధారపడితే, కొత్త ఆలోచనలు చేయడం, ప్రత్యామ్నాయ మార్గాలు వెతకడం వంటి సామర్థ్యాలు తగ్గిపోతాయని సూచిస్తున్నారు. ఉద్యోగ రంగంలో కూడా ఏఐ వినియోగం కొత్త సవాళ్లను తీసుకొస్తోందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అనేక పనులను ఏఐతో చేయిస్తున్నప్పటికీ, ఉద్యోగులు ఏఐ ఇచ్చిన సమాధానాలను పరిశీలించడం, సవరించడం, తప్పులు గుర్తించడం వంటి బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తోంది. ఈ నిరంతర పర్యవేక్షణ మానసిక అలసటకు దారితీసే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. దీనినే కొందరు ఏఐ బ్రెయిన్ ఫ్రై గా అభివర్ణిస్తున్నారు.
ఏఐ ఆధారిత పనులు పెరుగుతున్న నేపథ్యంలో కార్యాలయాల రూపకల్పనలో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రశాంతమైన ప్రదేశాలు, సహజ కాంతి, పచ్చదనం, సౌకర్యవంతమైన కూర్చునే ఏర్పాట్లు వంటి అంశాలకు ప్రాధాన్యం పెరుగుతోందని, ఇవి ఉద్యోగుల్లో ఏకాగ్రతను పెంచడంతోపాటు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏఐని పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దానిని సహాయక సాధనంగా ఉపయోగించాలి కానీ పూర్తిగా దానిపైనే ఆధారపడకూడదని సూచిస్తున్నారు. ఏదైనా ప్రశ్న లేదా సమస్య ఎదురైనప్పుడు ముందుగా స్వయంగా ఆలోచించి పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మాత్రమే ఏఐని ఉపయోగించి తన ఆలోచనను పోల్చుకోవడం, లోపాలు సరిదిద్దుకోవడం, సమాధానాన్ని మరింత మెరుగుపరచుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల స్వతంత్ర ఆలోచనా శక్తి నిలిచి ఉండటమే కాకుండా ఏఐ ప్రయోజనాలను కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.