రుతువుల్లో మార్పులతో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. వానకాలంలో కలుషితమైన నీళ్లు, ఆహారం కారణంగా డయేరియా, కలరా లాంటి వ్యాధులు వ్యాపిస్తుంటాయి. పరిశుభ్రత పాటిస్తుండటం, జీవన ప్రమాణాలు పెరగడంతో కలరా అంతగా ప్రబలడం లేదు. దీనికి భిన్నంగా డయేరియా మాత్రం ఏడాదంతా ప్రబలే అవకాశం ఉన్నా, వర్ష రుతువులో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వానకాలంలో పరిసరాల్లో నీళ్లు నిల్వడం వల్ల ఇన్ఫెక్షన్లు కలిగించే సూక్ష్మక్రిముల పెరుగుదలకు తగిన పరిస్థితులు ఏర్పడతాయి.
ఈ సీజన్లో కలుషితమైన నీళ్లు, అపరిశుభ్రమైన ఆహారం కారణంగానే డయేరియా అధికంగా వస్తుంది. దీని బారినపడితే రోజుకు మూడు నాలుగుసార్లకంటే ఎక్కువగా మల విసర్జనకు వెళ్లడం, నీళ్ల విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు డయేరియా రెండు వారాల వరకు పీడిస్తుంది. దీన్ని అక్యూట్ డయేరియా అంటారు. 15 రోజుల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని క్రానిక్ (దీర్ఘకాలిక) డయేరియా అని పిలుస్తారు. దీన్ని శరీరంలో మరిన్ని లోలోపలి సమస్యలకు సంకేతంగా భావించాలి.
డయేరియా… ఇన్ఫెక్షస్, ఇన్ఫ్లమేటరీ అని రెండు రకాలు. వైరస్, ప్రొటోజోవా లాంటి సూక్ష్మజీవుల వల్ల ఇన్ఫెక్షస్ డయేరియా బ్యాక్టీరియా కలుగుతుంది. పొట్టలో ఇన్ఫ్లమేషన్ వల్ల, కొన్నిసార్లు ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ లాంటి దీర్ఘకాలిక పేగు సంబంధ వ్యాధుల వల్ల ఇన్ఫ్లమేటరీ డయేరియా కలుగుతుంది.
డయేరియా అన్ని వయసుల వారికి వస్తుంది. అయితే, పదేళ్లలోపు పిల్లలు, యాభై ఏళ్లు దాటిన పెద్దల్లో తీవ్రత, ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలికంగా మధుమేహంతో బాధపడుతున్న వాళ్లు, హెచ్ఐవీ, గుండెజబ్బులు, స్టెరాయిడ్స్ లాంటి ఇమ్యునో సప్రెసివ్ మందులు వాడుతున్న వాళ్లు తీవ్రమైన డయేరియా బారినపడే ప్రమాదం ఉంది. ఇలాంటి వాళ్లలో ఓ మోస్తరు డయేరియా వచ్చినా డీహైడ్రేషన్, జబ్బు పడటం లాంటివి తొందరగా జరిగిపోతుంటాయి. వీరికి సత్వర వైద్య సహాయం అవసరం.
ఇల్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తినే తిండి, తాగే నీళ్ల పట్ల జాగ్రత్తగా ఉండటం వానకాలంలో డయేరియా నివారణకు మేలైన మార్గాలు. ఇంకొన్ని చిట్కాలు కూడా అనుసరించాలి.
డయేరియా చాలావరకు కొన్ని రోజుల్లోనే తగ్గిపోతుంది. చికిత్సలో శరీరాన్ని తగినంత హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవడమే ప్రధాన అంశం. ఓఆర్ఎస్, బటర్‌మిల్క్, ఇతర ఫ్లూయిడ్లను తీసుకుంటే డీహైడ్రేషన్ సమస్య తగ్గుతుంది. త్వరగా కోలుకుంటారు. డయేరియా ఉన్నప్పుడు ఫైబర్, కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తినకపోవడం మంచిది. మామూలు డయేరియాకు అయితే రక్త పరీక్ష, మల పరీక్షల అవసరం ఉండదు. కానీ తీవ్రమైన డయేరియా, ఇతర సమస్యలు ఉన్నప్పుడు ఈ పరీక్షలు అవసరం కావచ్చు.