Diabetes | రోజురోజుకూ ‘చలి’ ముదురుతున్నది. ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల పిల్లల నుంచి పెద్దల దాకా ఇబ్బంది పడాల్సి వస్తున్నది. ఇలాంటి సమయంలో చక్కెర (షుగర్) వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహ బాధితులకు చలికాలంలో అనేక సవాళ్లు ఎదురవుతాయనీ, వాటిని అధిగమించకుంటే ఆరోగ్యం మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఉదయాన్నే చలిలో వ్యాయామం చేయడం పెద్దవాళ్లకు ఇబ్బందిగా ఉంటుంది. దాంతో శారీరక వ్యాయామం తగ్గి.. షుగర్ లెవల్స్ పెరుగుతాయి. ఇలాకాకుండా ఉండాలంటే.. ఇంట్లోనే యోగా, జుంబా డ్యాన్స్ లాంటి ఇండోర్ వ్యాయామాలు చేయడం మంచిది. తర్వాత ఎండ వచ్చాక నడకలాంటి చిన్నచిన్న వ్యాయామాలు చేయాలి. చలిగాలులకు చర్మం పొడిబారి.. దురద పుడుతుంది. అక్కడ చిన్నగా రుద్దినా పుండ్లుగా మారి.. ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, చర్మాన్ని ఎప్పటికప్పుడు తేమగా ఉంచుకోవాలి. పుండ్లు పడ్డట్టుగా అనిపిస్తే.. వెంటనే చికిత్స తీసుకోవాలి. చలికాలంలో చెమట పట్టకపోవడం వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది.
ముఖ్యంగా.. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఈ సమస్య మరింత అధికంగా కనిపిస్తుంది. రాత్రిపూట మాటిమాటికీ మూత్ర విసర్జన కోసం వెళ్లాల్సి వస్తుంది. ఫలితంగా, నిద్ర కరువై.. ఒత్తిడికి గురవడం వల్ల కూడా చక్కెర స్థాయులు పెరిగిపోతాయి. కాబట్టి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం లాంటివి అలవాటు చేసుకోవాలి. ఇక దాహం వేయడం లేదని చలికాలంలో నీళ్లు తక్కువగా తాగుతుంటారు. ఫలితంగా శరీరం డీహైడ్రేషన్‌కు గురై.. రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. అందుకే ప్రతిరోజూ తగినంత నీరు తాగాల్సిందే! శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్జాతి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.