బతుకమ్మ పండుగంటే రోజూ ఆటలూ పాటలూ ఉంటాయి. నలుగురూ ఒక్కచోట కలవడం, ఆనందంగా ముచ్చట్లాడటమూ కనిపిస్తుంది. ఇలా గుంపులుగా నృత్యం, గానం చేయడం అన్నది శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే విషయమనీ నిపుణులు చెబుతున్నారు. మరి తెలంగాణ మన్ను మనకిచ్చిన దన్ను ఏమిటో తెలుసుకుందాం.
క్రమబద్ధంగా వంగుతూ, నిలబడుతూ బతుకమ్మ ఆడుతారు. దీనివల్ల నడుముకు కావాల్సిన వ్యాయామం లభిస్తుంది. వెన్నెముక, నడుము సమస్యలు దూరం అవుతాయి.
చప్పట్లు కొట్టడం వల్ల అర చేతులలోని నరాల చివరలు ఉత్తేజితం అవుతాయి. ఫలితంగా, చేతులు, కండరాలకు రక్త ప్రసరణ సవ్యంగా సాగుతుంది. రక్తపోటు తగ్గి.. గుండె జబ్బులు రాకుండా ఉంటుంది.
ఆడటం వల్ల శరీరంలోని వివిధ కండరాల్లో కదలికలు ఏర్పడతాయి. దాంతో అవి దృఢంగా తయారవుతాయి. అంతేకాదు, ఎముకలు కూడా గట్టి పడతాయి. ఆస్టియోపోరోసిస్లాంటి వ్యాధులూ రాకుండా ఉంటాయి.
జానపదం, శాస్త్రీయం లేదా వెస్టర్న్… ఇందులో ఏ రకమైన నృత్యం చేయడమైనా సరే మన శరీర సమతుల్యతకు సహకరిస్తుంది. చక్కగా నిలబడేందుకు ఉపయోగపడే బ్యాలెన్సింగ్ వ్యవస్థ మెరుగుపడుతుంది.
పాడటం లేదా ఆడటం… ఈ రెండింటిలోనూ మనం దమ్మును పట్టి ఉంచాల్సి వస్తుంది. తద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.
నలుగురితో కలిసి పాడటం, ఆడటం అన్నది మనసును ఉత్తేజితం చేసే ప్రక్రియ. అందుకే ఈ సమయంలో హ్యాపీ హార్మోన్లుగా పిలిచే డోపమైన్, ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. దాని వల్ల ఒత్తిడి, కుంగుబాటులాంటివి దూరమవుతాయి.
బృందంతో కలిసి గానం చేయడం, దానికి అనుగుణంగా నృత్యం చేయడం వల్ల మెదడులో వివిధ అంశాలను అనుసంధానం చేసే ప్రక్రియ జరుగుతుంది. మనకు తెలియకుండానే ఎదుటి వ్యక్తులతో అది బంధాన్నీ ఏర్పరుస్తుంది. తద్వారా వయసు రీత్యా వచ్చే మతిమరుపులాంటి సమస్యలు చుట్టుముట్టవు.
సంగీతం, నృత్యం ఒకదానికి ఒకటి ఎలా అనుసంధానం అవుతాయో… వాటిని కలుపుతూ సాగే బతుకమ్మ ఆటకూడా మానసిక, శారీరక ఆరోగ్యాలు రెండింటికీ వరప్రదాయినే!